Minister Uttam Kumar Reddy | తుమ్మిడిహట్టి ప్రాజెక్టును నిర్మిస్తాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణానికి మా ప్రభుత్వం ముమ్మాటికీ కట్టుబడి ఉందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు

విధాత, హైదరాబాద్ : తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణానికి మా ప్రభుత్వం ముమ్మాటికీ కట్టుబడి ఉందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రాణహిత చేవేళ్ల పథకం మేరకు తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. మండలిలో ఆయన సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం హయాంలో గంధమల్లపై ఇప్పటి వరకు ఒక్క రూపాయి పని కూడా జరగలేదని ఆరోపించారు. అక్కడి భూ సేకరణపై అధికారులతో ఓ కమిటీని నియమించి అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు. ఒకవేళ అక్కడున్న స్థానికులు భూ సేకరణకు స్వచ్ఛందంగా సహకరిస్తే యుద్ధ ప్రాతిపదికన 1.5 టీఎంసీ నీళ్లను నిల్వ చేసేందుకు వెంటనే పనులను ప్రారంభిస్తామని అన్నారు.
సుందిళ్ల బ్యారేజీ సీపేజ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. శాసన మండలిలో సాగునీటి ప్రాజెక్టులపై స్వల్పకాలిక జరిగిన చర్చలో సైతం తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. తుమ్మిడహట్టి వద్దే ప్రాజెక్టు కట్టాలని, అప్పుడే ప్రాణహిత నది నుంచి పుష్కలంగా నీళ్లు అందుతాయన్నారు. ప్రాజెక్టుకు బడ్జెట్లో రూ.5 వేలకోట్లు కేటాయించాలని కోరారు. గంధమల్ల రిజర్వాయర్ అంశం సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉందని మరో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇది పూర్తయితే ఆలేరు ప్రాంతానికి లాభం చేకూరుతుందని.. ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.