నేను మంత్రి పదవి ఆశిస్తున్నా.. సీఎం సానుకూలంగా స్పందించారు: ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
నేను మంత్రి పదవీ ఆశిస్తున్నానని.. నా అభిప్రాయం సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పగా ఆయన సానుకూలంగా స్పందించారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదవ్
కాంగ్రెస్ గెలుపులో కీలక భూమిక మాదే..53శాతం ఓట్లు వేశారు
విధాత, హైదరాబాద్ : నేను మంత్రి పదవీ ఆశిస్తున్నానని.. నా అభిప్రాయం సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పగా ఆయన సానుకూలంగా స్పందించారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. గొల్లకుర్మలకు మంత్రి పదవీ ఇవ్వాలని సీఎం, డిప్యూటీ సీఎం, మిగతా మంత్రులను కూడా కలిశామని చెప్పారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఇద్దరికి మంత్రి పదవులు వచ్చాయని, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రులుగా వున్నారని, భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఒక్కరూ కూడా మంత్రులుగా లేరని గుర్తు చేశారు.
భువనగిరి పార్లమెంట్ పరిధిలో నాకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నానని, మొదటి సారిగా గొల్లకుర్మల నుంచి మంత్రి వర్గంలో ఎవరు లేరని, ఇదే సమయంలో ఆంధ్రలో ముగ్గురికి మంత్రివర్గంలో చాన్స్ ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో కూడా మంత్రివర్గంలో మాకు చోటు కల్పించాలని కోరుతున్నామని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కుర్మలకు ప్రతినిధిగా మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరడం జరిగిందన్నారు. గొల్లకుర్మలకు మంత్రితో పాటు ఎమ్మెల్సీ, ఒక అడ్వైజర్ పోస్ట్, ఐదు కార్పొరేషన్లు, పీసీసీ చీఫ్ పోస్ట్, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్, రెండు సీఎం పీఆర్‌వో పోస్టులు కావాలని కోరారు.
50 లక్షల పై చిలుకు జనాభా వున్న గొల్లకుర్మలకు ప్రభుత్వంలో పదవులు ఇవ్వాలని, సీఎం పై నమ్మకం వుందని, నాకు మంత్రి పదవి తప్పకుండా వస్తుందన్నారు. కాంగ్రెస్‌ను ఆదుకున్నది గొల్లకుర్మలేనని, 53 శాతం ఓట్లు మావే పడ్డాయని చెప్పుకొచ్చారు. కేసీఆర్ గోర్లు బర్లు ఇస్తేనే ఓడగొట్టినామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సరితా తిరుపతయ్య కు మంత్రి పదవిపై హామీ ఇచ్చారని తెలుస్తుందన్నారు. బీఆరెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు ఎవరు వచ్చిన పార్టీలో చేర్చుకుంటామని, విభజన అంశాలపై ఇద్దరు సీఎంలు చర్చించారని, సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు పడిందన్నారు.