మోదీ, రేవంత్ కుట్రలో భాగమే కేసీఆర్ ప్రచార నిషేధం: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రచారాన్ని 48గంటల పాటు నిషేధించడం భాయ్ మోదీ..చోటా భాయ్ సీఎం రేవంత్‌రెడ్డిల కుట్రలో భాగమేనని మాజీ

మోదీ, రేవంత్ కుట్రలో భాగమే కేసీఆర్ ప్రచార నిషేధం: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
  • వారిద్దరి విద్వేష ప్రసంగాలు ఈసీకి కనిపించలేదా
  • పారదర్శక విచారణకే ఓటుకు నోటు కేసు బదిలీ పిటీషన్‌

విధాత : పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రచారాన్ని 48గంటల పాటు నిషేధించడం భాయ్ మోదీ..చోటా భాయ్ సీఎం రేవంత్‌రెడ్డిల కుట్రలో భాగమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌ల విద్వేష ప్రసంగాలు, ఫేక్ వీడియోలు ఈసీకి కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులు నేత కార్మికులని అవమానకరంగా మాట్లాడిన సందర్భంలో కేసీఆర్ వారిపై ప్రతి విమర్శలు చేశారని, అంత మాత్రాన కేసీఆర్ ప్రచారంపై నిషేధం పెట్టిన ఈసీ..అటు ఫేక్ వీడియోలు ప్రచారం చేసిన రేవంత్‌కు మాత్రం నోటీసులతో సరిపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్, మోదీలకు వణుకుడు మొదలైందని, ఆరు యాత్రలతోనే ఇద్దరి కాళ్ళ కింద భూమి కంపిస్తుందని, ఇద్దరు కుట్ర చేసి కేసీఆర్ ప్రచారం ఆపాలని ఎత్తులు వేశారని ఆరోపించారు. కేసీఆర్ వెంట ప్రజా ప్రభంజనం చూసి భయపడుతూ చిల్లర ప్రయత్నంగా కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం కుట్ర చేశారన్నారు.

ప్రచారంలో కేసీఆర్‌ను అడ్డుకోవడంతో రెట్టింపు ప్రజా మద్దతు వస్తుందన్నారు. వీధి రౌడిగా మాట్లాడిన సీఎం రేవంత్ స్వేచ్ఛగా తిరుగుతుంటే, మా సోషల్ మీడియా ఇంఛార్జి క్రిషాంక్ అరెస్టు చేసి జైలులో పెట్టారని, కేసీఆర్‌ను ఇంటికి పరిమితం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి డబుల్‌ ఆర్ మూటలపై సమాచారం ఉంటే మోదీ ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడంలేదని ప్రశ్నించారు. రేవంత్ అవినీతి తెలిసినా మోదీ విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. ప్రచారంలో కేసీఆర్ లేవనెత్తిన ప్రజలు, రైతుల సమస్యలు, కాంగ్రెస్, బీజేపీ హామీల వైఫల్యాలపై ప్రజల్లో చర్చ సాగకుండా అడ్డుకునేందుకే కేసీఆర్ ప్రచారంపై నిషేధ డ్రామాలు వేశారన్నారు. నిషేదాలు కేసీఆర్‌ను ఆపలేవని, ప్రచారంలో కేసీఆర్ కనిపించడం లేదన్న చర్చ జనంలో మొదలైందని, కేసీఆర్‌ను ప్రచారం చేయకుండా ఆపడం మా ఓట్ల శాతాన్ని పెంచుతుందని, ఎన్ని నిషేధాలు పెట్టినా 16సీట్లు మావేనన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి సంబంధించిన ఓటుకి నోటు కేసు ఇక్కడ ఉంటే ప్రభావితం చేస్తారని అనుమానం ఉన్నందునే ఇతర రాష్ట్రంలోకి మార్చాలని కోరామని, శుక్రవారం కోర్టు నుంచి సరైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామన్నారు.