విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సోమవారం రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య ను కాదని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఖరారు చేసినప్పటి నుంచి నియోజకవర్గంలో సమస్య నెలకొన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరి కడియం శ్రీహరికి రాజయ్య మద్దతు పలికినట్లు వార్తలు వెలువడినప్పటికీ డాక్టర్ తనదైన శైలిలో సంపూర్ణంగా ఈ రాజీకి అంగీకరించినట్లు చెప్పకపోవడంతో అనుమానాలు నెలకొన్నాయి. నిన్నటికి నిన్న కూడా స్టేషన్ గన్ పూర్ లో అభద్రతాభావంతో ప్రజలు ఉన్నారని ఫ్లెక్సీలు కట్టాలన్న, డబ్బు కొట్టాలన్న భయపడుతున్నారంటూ మాట్లాడారు.
ఈ నేపథ్యంలో రాజయ్య రైతుబంధు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడంతో స్టేషన్గన్పూర్ లో నెలకొన్న సందిగ్ధత సమసిపోయింది. నిజమే రాజయ్య ఇప్పుడు రైతుబంధు చైర్మన్. ఈ మధ్యకాలంలో తరచూ ఆయన నోటి నుంచి వెలువడిన మాట ప్రకారం జనవరి 17 వరకు రాజయ్య ఎమ్మెల్యేనే. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది మాత్రం కడియం శ్రీహరి అనేది స్పష్టమైంది.