Kavitha Resigns From BRS : ఎమ్మెల్సీకి..బీఆర్ఎస్ సభ్యత్వానికి కవిత రాజీనామా
ఎమ్మెల్సీ పదవి, బీఆర్ఎస్ సభ్యత్వానికి కవిత రాజీనామా ప్రకటించి, త్వరలో తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను వెల్లడించనున్నట్లు తెలిపింది.

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్(BRS) నుంచి సస్పెండ్ కు గురైన ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. బుధవారం కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్పీకర్ ఫార్మెట్ లో శాసన మండలి చైర్మన్ కు ఎమ్మెల్సీ పదవి లేఖను ఇస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే బీఆర్ఎస్ సభ్యత్వ రాజీనామా లేఖను కేసీఆర్ కు, పార్టీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డికి(Ravula Chandrasekhar Reddy) పంపిస్తున్నట్లుగా తెలిపారు. త్వరలోనే నా భవిష్యత్తు రాజకీయ కార్యచరణ ప్రకటిస్తానన్నారు.
బీఆర్ఎస్ లో కేసీఆర్(KCR), కేటీఆర్(KTR), కవితలు(Kavitha) కలిసి ఉంటే తమ ఆటలు సాగవన్న కుట్రతోనే హరీష్ రావు(Harish Rao), సంతోస్ రావులు నాకు వ్యతిరేకంగా కుట్రలు చేసి పార్టీ నుంచి బయటకు పంపించారన్నారు. నన్ను పార్టీ నుంచి బయటకు పంపినట్లుగానే..రేపు కేటీఆర్, కేసీఆర్ లకు వ్యతిరేకంగా కూడా వారు కుట్రలు చేస్తారని..పార్టీని వారు హస్తగతం చేసుకోవచ్చని కవిత హెచ్చరించారు. కాళేశ్వరం అవినీతికి, కేసీఆర్ పైన సీబీఐ విచారణకు పూర్తిగా హరీష్ రావు కారణమని కవిత ఆరోపించారు. తుమ్మడిహట్టి నుంచి అలైన్ మార్పు, కాళేశ్వరం డిజైన్లు, అనుమతులలో కీలకంగా ఉన్న హరీష్ రావును వదిలి కేసీఆర్ లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు విమర్శలు చేయడం వెనుక హరీష్ రావు కుట్ర ఉందన్నారు. హరీష్ రావు , రేవంత్ రెడ్డిలు గతంలో ఒకే విమానంలో ప్రయాణించిన సందర్భంగా వారి మధ్య అవగాహన కుదిరందని..అప్పటి నుంచే కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టే కుట్రలను హరీష్ రావు అమలు చేశారన్నారు. రేవంత్ రెడ్డితో కలిసే హరీష్ రావు మా కుటుంబానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాడని కవిత ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ రావుల(Santosh Rao) అవినీతి ఏసీబీకి ఎందుకు కనబడటం లేదని..సంతోష్ రావు మోకిలాలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి 750కోట్ల విల్లా కడుతున్నాడని వారికి అంతడబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. నవీన్ రావు కూడా సంతోష్ రావు మనిషిగా పదవులు, డబ్బులు పొందాడని చెప్పారు. నేను సామాజిక తెలంగాణ అంటే హరీష్ రావు నాకు వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టాడని.. బీఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా భౌగోళిక తెలంగాణ చాలా అని కవిత ప్రశ్నించారు. బంగారు తెలంగాణ కేసీఆర్ ఇచ్చిన నినాదమే కదా అని..హరీష్ రావు ..సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదని.. ప్రతి సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అన్నారు.