Hitansh Raj | అతని చేతుల్లో దేవుళ్లు నాట్యం చేస్తారు!.. వండర్ కిడ్.. హితాంశ్ రాజ్
ఏఎస్ రావ్ నగర్‌లోని ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే.. ఎటు చూసినా దేవుళ్లే కనిపిస్తారు. ముక్కోటి దేవతలందరూ వివిధ రకాల రూపాల్లో అక్కడే కొలువై ఉన్నారా.. అనిపిస్తుంది

ఏఎస్ రావ్ నగర్‌లోని ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే.. ఎటు చూసినా దేవుళ్లే కనిపిస్తారు. ముక్కోటి దేవతలందరూ వివిధ రకాల రూపాల్లో అక్కడే కొలువై ఉన్నారా.. అనిపిస్తుంది. ఆ ముక్కోటి దేవతలందరినీ ఇలలోకి రప్పించింది.. ఒక పసివాడు. తొమ్మిదేండ్ల హితాంశ్ రాజ్ చేతిలో ప్రాణం పోసుకునే దైవ రూపాలన్నీ ఇండి నిండా దర్శనమిస్తాయి. దేవతలందరూ ఒకటై వచ్చి దీవెనలందించారేమో.. రంగులైనా, క్లే అయినా అతడి చేతిలో దైవత్వాన్ని సంతరించుకుంటాయి.
గ్రాండ్ పేరెంట్స్ ఉన్న ఇంట్లో పెరిగే పిల్లలకు కథలకూ, సంస్కారానికీ కొదవుండదు. హితాంశ్ ని చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. నానమ్మ చేసే పూజలు హితాంశ్ లో కళను నిద్ర లేపాయి. గుడిలో దేవుణ్ణి చూస్తే ఎవరికైనా భక్తి భావం కలుగుతుంది. హితాంశ్ రాజ్ కి మాత్రం.. ఆ దేవుని రూపురేఖలతో పాటు, ఆయన ధరించిన ఆభరణాలు, మూర్తిమత్వం… అన్నీ ఆకర్షిస్తాయి. అవన్నీ అతని చేతిలో చిత్రాలుగానో, క్లే ఆర్ట్ గానో తిరిగి రూపుదిద్దుకుంటాయి.
ఎవరీ వండర్ కిడ్?
పూర్ణిమ, రాజశేఖర్ దంపతుల ముద్దుబిడ్డ హితాంశ్ రాజ్. నాలుగేళ్ల చిరుప్రాయం లోనే ఇతడి దృష్టి పురాణేతిహాసాలకు సంబంధించిన అంశాల పైకి మళ్లింది. చిత్రకళ బాగా ఆకర్షించింది. హిందూ పురాణాల్లోని కథలకు తన కళ ద్వారా జీవం పోయడం మొదలుపెట్టాడు. హైదరాబాద్ లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్-2 లో చదువుతున్నాడు. పట్ట చిత్ర ఆర్ట్ ద్వారా దైవరూపాలకు ప్రాణం పోయగలడు. బొమ్మలు గీయడమే కాదు.. క్లే ద్వారా దేవతల రూపాలను తయారుచేయడంలో కూడా దిట్ట ఈ బుడతడు. ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే… ఒక రూపాన్ని చిత్రించేటప్పుడు గానీ, మట్టితో బొమ్మ రూపొందించేటప్పుడు గానీ.. దానిలోని ఒక్క చిన్న డీటెయిల్ కూడా మిస్ కాడు. ఆభరణాల్లోని అతి సూక్ష్మమైన డిజైన్ గానీ, ముఖంలో పలికే భావోద్వేగాన్ని గానీ అతి వివరంగా సృష్టించగలడు. అమెరికన్ మెరిట్ కౌన్సిల్ నుంచి అప్రీషియేషన్ లెటర్ కూడా అందుకున్న ఘనత హితాంశ్ ది.
ఇంటర్నెట్ గురువు
చిన్నపిల్లలు ఎవరికైనా ఫోన్ చేతికిస్తే.. ఏం చేస్తారు..? ఇన్‌ఫోబెల్ వీడియోలో, కార్టూన్లో చూస్తారు. లేదా వీడియో గేమ్స్ ఆడుతారు. ఇంటర్నెట్ పిల్లల్ని తప్పుదారి పట్టిస్తున్నదని భయపడుతున్న రోజులివి. కానీ.. అదే ఇంటర్నెట్.. హితాంశ్ లో దాగి వున్న కళకు పదునుబెట్టింది. యూట్యూబ్ లో వీడియోలు చూసి పట్టచిత్ర ఆర్ట్ నేర్చుకున్న మొదటి పసివాడు బహుశా.. హితాంశ్ ఒక్కడేనేమో! ఇంటర్నెట్ మాధ్యమాన్ని తన సృజనాత్మకతను పెంచుకోవడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఉపయోగించుకున్న హితాంశ్ రాజ్ ని మెచ్చుకోకుండా ఉండలేం.
రోల్ మోడల్ ఎవరంటే…
కాళికా దేవిని చూస్తే ఒక రౌద్ర రూపం గుర్తుకువస్తుంది. హితాంశ్ కి మాత్రం ఆమె రూపం ఒక ఇన్ స్పిరేషన్. తనలోని సృజనాత్మకతను తట్టి లేపే రోల్ మోడల్. ఆమె ఆశీస్సులే చిత్రకళ, క్లే ఆర్ట్ లో నైపుణ్యం సాధించేలా చేశాయంటారు హితాంశ్ కుటుంబ సభ్యులు. చదువు.. మార్కులు .. అంటూ వెంటపడే తల్లిదండ్రులున్న ఈ కాలంలో.. తన లోని కళకు ప్రోత్సాహాన్ని అందించే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఉండటాన్ని గర్వంగా ఫీలవుతాడు హితాంశ్. ఇండియాలోని అన్ని దేవాలయాలను దర్శించడం, వాటిలో దాగి వున్న నిర్మాణ అద్భుతాల గురించి అన్వేషించడం, అర్థం చేసుకోవడం, నైపుణ్యం సాధించడమే హితాంశ్ కల. టెంపుల్ ఆర్కిటెక్ట్ గా ఎదగాలన్నది అతడి లక్ష్యం. హితాంశ్ తన లక్ష్య సాధనలో తప్పనిసరిగా విజయం సాధిస్తాడని ఆశిద్దాం.
The record for making the maximum number of deities’ models made using soft clay was set by Missala Hitansh Raj of Hyderabad, Telangana. #deities #hyderabad #telangana #lordkrishna #softclay #clayart #idol #IBR
Know More: https://t.co/YAOjhZDjjM pic.twitter.com/zgAEe5cnp7— India Book of Records (IBR) (@indiabookrecord) June 12, 2024
అవార్డులూ… రివార్డులూ…
సాఫ్ట్ క్లే ద్వారా అతి చిన్న వయసులోనే అనేక మంది దేవతల రూపాల తయారీకి, చిత్రాల కోసం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, కలాం వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు.
– తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ – బెస్ట్ టాలెంట్ అవార్డ్
– తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్
– తెలుగు సంస్కృతి సాహితీ సేవ ట్రస్ట్ వారి నుంచి నంది అవార్డ్
– రవీంద్రనాథ్ ఠాగూర్ స్మారకంగా అందించే గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవార్డులలో భాగంగా, 2024 సంవత్సరానికి గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.
– ఇంటర్నేషనల్ స్టార్ కిడ్స్ అవార్డ్స్ నుంచి స్టార్ అచీవర్.
ఇవే కాకుండా ఇంకో మూడు నాలుగు అవార్డులు అందుకోనున్నాడు.