24.. డెడ్‌లైన్ టార్గెట్.. 26!
బీఆరెస్ శాసన సభా పక్షం విలీనం దిశగా కాంగ్రెస్ పార్టీ ముమ్మర యత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఏడుగురు బీఆరెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్.. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా, మూడింట రెండు వంతుల మంది అంటే మొత్తంగా 26 మంది సభ్యులను చేర్చుకునే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది.

ఇప్పటికే బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఏడుగురు ఎమ్మెల్యేలు
వారంలోగా 19 మంది చేర్చుకునే యత్నాల్లో అధికార పార్టీ?
బీఆరెస్ శాసనసభాపక్ష విలీనం దిశగా ముమ్మర యత్నాలు
ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
కొత్త రెవెన్యూ చట్టం సహా కీలక బిల్లులు తేనున్న సర్కార్
అందుకోసం మండలిలోనూ కాంగ్రెస్‌కు మెజార్టీపై ఫోకస్
సర్కారు సుస్థిరత అనంతరం పూర్తిగా పరిపాలనపై దృష్టి
విధాత: బీఆరెస్ శాసన సభా పక్షం విలీనం దిశగా కాంగ్రెస్ పార్టీ ముమ్మర యత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఏడుగురు బీఆరెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్.. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా, మూడింట రెండు వంతుల మంది అంటే మొత్తంగా 26 మంది సభ్యులను చేర్చుకునే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే మరో 19 మంది బీఆరెస్ సభ్యులను అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే జూలై 24వ తేదీ నాటికి చేరికలకు ముగింపు పలికే ప్రయత్నాల్లో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో మండలిలో నామమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా మెజార్టీ సాధించే ప్రయత్నాల్లో ఉంది. అసెంబ్లీలో చేసే చట్టాలకు మండలి ఆమోదం అత్యంత కీలకం. ప్రభుత్వం మనుగడను సుస్థిరం చేసుకున్న తరువాత పరిపాలనపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించి, తన ఎన్నికల వాగ్దాలను అమలు చేయాలని భావిస్తున్నదని సమాచారం. ఈ క్రమంలో మండలిలోనూ బీఆరెస్ పక్షాన్ని విలీనం చేసుకునే ప్రయత్నాల్లో ఉందని చెబుతున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారు. మండలిలో మెజార్టీ కోసం కాంగ్రెస్‌కు మరో 9 మంది ఎమ్మెల్సీలు అవసరం. ఒకవైపు ఎమ్మెల్యేల చేరికపై ముమ్మర యత్నాలు చేస్తూనే… అవసరమైన ఎమ్మెల్సీను చేర్చుకుంటోంది.
అసెంబ్లీలో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, మండలిలో కూడా ఆదిపత్యం సాధించే దిశలో నాడు కేసీఆర్ వలసలను ప్రోత్సహించడం కోసం అందుకున్న రాజకీయ పునరేకీకరణ సిద్ధాంతాన్నే నేడు కాంగ్రెస్ శరవేగంగా అమలు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా కాంగ్రెస్ పార్టీ తీసుకురానున్న చట్టాలకు ఉభయ సభల ఆమోదం లభించేలా చేసుకుంటున్నదని చెబుతున్నారు.
ధరణిని బంగాళాఖాతంలో కలిపి, నూతన విధానం తీసుకు వస్తానని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలల్లో హామీ ఇచ్చింది. ఈ మేరకు ధరణిని రద్దు చేయాలన్నా, ధరణిలో మార్పులు తీసుకురావాలన్నా నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకు రావాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. ఈ మేరకు రెవెన్యూ పాలనను గాడిలో పెట్టడంతో పాటు గ్రామ స్థాయి వరకు రెవెన్యూ పాలనను తీసుకు రావాలన్నా, రైతుల భూ సమస్యలను పరిష్కరించాలన్నా నూతన రెవెన్యూ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఈ మేరకు కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం ముమ్మర యత్నాలు చేస్తున్నది. ఈ నెల 24వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానున్నారని విశ్వసనీయంగా తెలుస్తున్నది. కొత్త చట్టం అసెంబ్లీ ఆమోదం పొందిన తరువాత అమలులోకి రావాలంటే మండలి ఆమోదం పొందాలి. ఇలా ఉభయ సభల ఆమోదం పొందిన తరువాత గవర్నర్ సంతకం అయితేనే చట్టంగా అమలులోకి రానున్నది. అలాగే బడ్జెట్ కూడా ఉభయ సభల ఆమోదం అవసరం. ఇలా ప్రజలకు సంబంధించి ఏ ఒక్క నూతన చట్టం అమలులోకి రావాలన్నా ఉభయ సభల ఆమోదం తప్పని సరి కావడంతో మండలిలో కేవలం 4 సభ్యుల వరకే మాత్రమే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ బీఆరెస్ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా యత్నాలు ముమ్మరం చేసిందని చెబుతున్నారు.
టిట్ ఫర్ టాట్
2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతో భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చిన బీఆరెస్ కేవలం 19 సీట్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడింది. రాజకీయ పునరేకీకరణ అంటూ 12 మంది ఎమ్మెల్యేలతో సీఎల్పీని బీఆరెస్ ఎల్పీలో విలీనం చేసుకున్నది. మిగిలిన కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా అవమానిందనే అభిప్రాయాలు ఉన్నాయి. వాస్తవంగా 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆరెస్‌కు ఉభయ సభలలో ఆధిపత్యం ఉన్నది. బిల్లులు సాఫీగా ఆమోదం పొందే పరిస్థితి ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలన్న ఆలోచనతో నాడు ఆ పార్టీని బీఆరెస్ నిట్టనిలువునా చీల్చిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్న భావన కలిగేలా చేసిందని విమర్శలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జనంలోకి వెళ్లి పార్టీని కాపాడుకోవడమే కాకుండా నేలకు కొట్టిన బంతి పైకి ఎగిరిన తీరుగా లేచి నిలబడి కొట్లాడి పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. అయితే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వం కూలిపోతుందంటూ ప్రచారం మొదలైంది. పలువురు బీజేపీ, బీఆరెస్ నేతలు ప్రభుత్వం కూలిపోతుందంటూ రోజుల వ్యవధిలోనే స్టేట్‌మెంట్లు ఇస్తూపోయారు. దీంతో 65 సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి వలసలను ప్రోత్సహించాలనే నిర్ణయానికి వచ్చింది. టిట్ ఫర్ టాట్ అన్న తీరుగా అసెంబ్లీ, మండలిలో బీఆరెస్ ఎల్పీలను విలీనం చేసుకొని, చట్ట సభలలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలన్న తలంపుతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీ, బీఆరెస్ మధ్య రహస్య అవగాహన!
పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ సరళిని పరిశీలించిన తరువాత బీజేపీ, బీఆరెస్ మధ్య రహస్య అవగాహన ఏమైనా ఉన్నదా? అన్న సందేహాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేస్తోంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేయడానికి వచ్చిన కురియన్‌కు బీఆరెస్ వాళ్లు బీజేపీకి ఓట్లు వేయడంతోనే ఓటమి పాలయ్యామని లెక్కలతో సహా వివరించారు. దీంతో ఈ రెండు పార్టీ మధ్య బంధం బలపడక ముందే బీఆరెస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రక్రియను పూర్తి చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ఉన్నట్లు చర్చలు నడుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందే చేరికల ప్రక్రియను పూర్తి చేసుకొని పాలనపై కేంద్రీకరించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డంకులు రాకుండా రాచ మార్గం వేసుకుంటున్నదని అంటున్నారు.