బీఆరెస్ బాటలోనే కాంగ్రెస్ నిరంకుశ పాలన: ఎంపీ ఈటల

నిరంకుశ పాలనతో పేద ప్రజలను ఇబ్బందుల పాలు చేసినందుకు ప్రజలు కేసీఆర్ ను రాజకీయంగా బొంద పెట్టారని ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు

బీఆరెస్ బాటలోనే కాంగ్రెస్ నిరంకుశ పాలన: ఎంపీ ఈటల

ఫిర్జాదీగూడలో ఇళ్ల కూల్చివేతపై ఈటల మండిపాటు

విధాత, హైదరాబాద్ : నిరంకుశ పాలనతో పేద ప్రజలను ఇబ్బందుల పాలు చేసినందుకు ప్రజలు కేసీఆర్ ను రాజకీయంగా బొంద పెట్టారని ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీర్జాదిగూడ పరిధిలోని ప్రియ ఎన్ క్లేవ్ లో ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయడంపై సోమవారం ఈటల మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రాకముందు పేదలపై మొసలి కన్నీళ్లు కార్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పేదల ఇళ్లను కూల్చివేస్తోందని ధ్వజమెత్తారు. నిరుపేదలు ఇతరుల వద్ద కొనుక్కుని అన్ని అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం దారుణం అన్నారు.

ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్న వారంతా చిన్న చిన్న ఉద్యోగులు, పేదలేనని ఇవి నిజంగా అక్రమ భూములే అయితే ఇళ్ల నిర్మాణానికి, గృహ రుణాలతో పాటు జీహెచ్ఎంసీ నుంచి ఎలా అనుమతులు వచ్చాయని నిలదీశారు. ఈ ఇళ్ల కూల్చివేత వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందని మండిపడ్డారు. వీరంతా ఇళ్లు నిర్మించుకోవడానికి కాంగ్రెస్‌లో చేరిన రామ్ దాస్ గౌడ్ నుంచే బాధితులంతా కొనుగోలు చేశారన్నారు. పోచయ్య అనే కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం లేదనే కోపంతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. 30, 40 ఏళ్ల క్రితం కొనుక్కున్న భూముల విషయంలో ఇప్పుడు కలగజేసుకోవడం సరికాదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్ల 300 మంది చిరుద్యోగులు రోడ్డున పడ్డారని విమర్శించారు. అన్ని అనుమతులు ఉన్నా పేదల ఇళ్లు కూల్చేసిన ఎమ్మార్వోకు, అందుకు ఆర్డర్ ఇచ్చిన ఆర్డీవోకు, ఆ పైనున్న కలెక్టర్ కు బుద్ధి జ్ఞానం ఏమైందని ప్రశ్నించారు. గంజాయి, గుడుంబా, దొంగలను అరికట్టడం చేతకాని ప్రభుత్వం 200 మంది పోలీసులను పంపించి పేదోళ్ల ఇళ్లను కూల్చి వేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఒళ్లు వంచి అధికారంలోకి రాలేదని, కేసీఆర్ ను ఓడించాలని ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెడితే అధికారంలోకి వచ్చాక కళ్లునెత్తికెక్కాయన్నారు. ఇళ్ల కూల్చివేత విషయంలో డిప్యూటీ సీఎంతో సహా మంత్రులకు ఫోన్ చేసినా తీయడం లేదని ఆరోపించారు.

కేసీఆర్ పాలనలో అన్యాయం జరిగిందని చాలా మంది ఉద్యమకారులు, మేధావులు కాంగ్రెస్ కు మద్దతుగా నిలిస్తే అధికారంలోకి వచ్చాక వీరు చేసే వాలకం ఏంటో తెలుసుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలు 24 ఏళ్లలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి తాను ఎన్నడూ చూడలేదన్నారు. మాట్లాడితే న్యాయం ధర్మం అని చెప్పే కాంగ్రెస్ నేతలు.. పేదల ఇళ్లపై దండయాత్ర చేయడమేమిటని ప్రశ్నించారు. కేసులు పెట్టి జైళ్లకు పంపి భయపెట్టాలని అనుకుంటే అలా చేసిన వాడు ఏమైపోయాడో తెలిసిన తర్వాత కూడా మీరు అదే పని చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు సమస్య వస్తే పరిష్కరించేదిగా వ్యవస్థలుగా ఉండాలే తప్ప ప్రభుత్వమే ప్రజలను హింస పెట్టే దౌర్భాగ్య పరిస్థితి ఉండకూడదన్నారు. గత కేసీఆర్ హయాంలో ఇదే పరిస్థితి ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలోనూ ఇదే తీరు కనిపిస్తున్నదని ధ్వజమెత్తారు.