నల్లగొండలో ఓ కుటుంబంలోని సభ్యులు అంతా కలిసి ఒకేసారి మిస్సింగ్ కావడం సంచలనం రేపింది. మిర్యాలగూడ రోడ్‌లోని శ్రీనివాస కాలనీకి చెందిన కుటుంబంలోని నలుగురు ఏమయ్యారన్నది మిస్టరీగా మారింది.
అదృశ్యమైన వారిలో భార్య భర్తలు గిరి శ్రీకాంత్ (44), భార్య గిరి లక్ష్మీ (42), కుమార్తె హర్షిత (23), కుమారుడు సాయి చరణ్ (20) లు ఉన్నారు. అప్పుల బాధతో వారు ఇంటి నుంచి వెళ్లిపోయి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. వారంతా సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా గుర్తించారు.
కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన గిరి శ్రీకాంత్ జగిత్యాలలో వ్యాపారం చేయగా.. తీవ్రంగా నష్టాలు రావడంతో అప్పులపాలయ్యాడు. దీంతో శ్రీకాంత్ లక్ష్మి దంపతులు తమ పిల్లలు హర్షిత, సాయిచరణ్‌తో కలిసి నల్గొండకు వచ్చి బీటీఎస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. దంపతులు వేర్వేరు కిరాణషాపుల్లో పనిచేస్తుండగా, పిల్లలు బీటెక్ చదువుతున్నారు. శనివారం నుంచి బంధువులు ఫోన్ చేస్తున్నా స్విచాఫ్ అని వస్తుండడంతో వారు ఇంటికి వచ్చి చూశారు.ఇంటికి తాళం వేసి ఉండడంతో దానిని పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా.. ‘ఇన్ని రోజులు అండగా నిలబడి ఉన్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాం. ఏమైనా ఇబ్బంది పెడితే క్షమించండి.. ఇక సెలవు’ అంటూ రాసిన నోట్ కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే శ్రీకాంత్ కుటుంబం ఎక్కడికి వెళ్లింది..వారు ప్రాణాలతో ఉన్నారా? లేదో తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా లొకేషన్‌ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పట్టణంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. నలుగురు ఖమ్మం బస్సు ఎక్కినట్లు గుర్తించారు.
