విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నల్గొండ నియోజకవర్గంలో ఉన్న ఒకేఒక్క కాంగ్రెస్ ఎంపీపీ మనిమద్దె సుమన్ ఆదివారం మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ గూటికి చేరారు. ఎన్నికలవేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్లయ్యింది. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడిగా సుమన్ మండలంలో కీలక నేతగా ఎదిగారు. ఆయన బీఆర్ఎస్ లో చేరడంతో కాంగ్రెస్ కు రూరల్ పరిధిలో నష్టం చేకూరే అవకాశం ఉంది. కంచర్ల భూపాల్ రెడ్డితో గత కొద్దికాలంగా సన్నిహితంగా ఉన్న సుమన్, ఎట్టకేలకు బీఆరెస్ లో చేరడం చర్చనీయాంశమైంది.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో మంతనాలు జరిపిన సుమన్, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నల్లగొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, 7వ వార్డు కౌన్సిలర్ మారగొని గణేష్ పాల్గొన్నారు.