- పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం
- పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ
- భారీ జనసమీకరణకు తీవ్ర యత్నం
- ఇక అధికారం మాదేనంటూ ప్రచారం
- రాష్ట్ర బీజేపీలో తీవ్ర అంతర్గత విభేదాలు
- తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్రం నిర్లక్ష్యం
- కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల విమర్శలు
విధాత,ప్రత్యేక ప్రతినిధి:
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన తెలంగాణ పర్యటనకు వస్తున్న వేళ భిన్న రాజకీయ చర్చసాగుతోంది. మూడవ పర్యాయం ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలొచ్చినప్పటికీ, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని ఓడించారంటూ సమరోత్సాహాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీ శ్రేణులు.. మోదీ పర్యటనను పతాకస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. మోదీ రాకతో ఇక తెలంగాణలో ఏదో జరుగబోతోందంటూ ఆ పార్టీ ప్రచారాన్ని లంకించుకుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు తొలి అంకంగా మోదీ పర్యటనను బీజేపీ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. రాష్ట్ర పర్యటనకు వస్తున్న మోదీ.. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు పార్టీ పరంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ దాడి!
ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేసింది. దాదాపు రెండు లక్షల మంది హాజరవుతారని బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేస్తారని భావిస్తున్నారు. తెలంగాణకు ఇప్పటి వరకు ఇచ్చిన కేంద్ర నిధులు, ప్రాజెక్టులు వివరించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని నిలదీస్తారని అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతల అవినీతి ఎండగడుతారని, గతంలో బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలను కడిగిపారేస్తారంటూ చెబుతున్నారు. మోదీ పర్యటను వినియోగించుకుని బీజేపీ లీడర్లు, కేడర్ లో ఉత్సాహాన్ని నింపేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధాని మోదీ పర్యటనతో కౌంట్ డౌన్ ప్రారంభమవుతోందంటూ ఆ పార్టీ ముఖ్యనాయకులు ఇప్పటి నుంచే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్యం
తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులకు నిధులు, అనుమతులు మంజూరు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంగా భావించి తగిన ప్రాధాన్యం ఇనివ్వడంలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అనేక ప్రాజెక్టులు ఇప్పటి వరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ కారణంగానే బీజేపీకి తెలంగాణలో సానుకూల పరిస్థితులు నెలకొనలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ కష్టసమయంలో రాష్ట్రం నుంచి ఎనిమిది ఎంపీలను గెలిపించినప్పటికీ తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన ప్రాజక్టులకు కేంద్రం నుంచి అనుమతులు, నిధులు తేవడంలో విఫలమయ్యారని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ ప్రచారాన్ని బీజేపీ నాయకులు ఖండిస్తున్నప్పటికీ సాధారణంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు కాకుండా రాష్ట్రానికి ప్రత్యేక నిధులు తెచ్చినపుడే ప్రజల్లో చర్చసానుకూలంగా సాగుతోందంటున్నారు. ఇటీవల పొరుగు తెలుగు రాష్ట్రం ఏపీపై కనబరుస్తున్న శ్రద్ధలో పదో వంతు కూడా కేంద్రం తెలంగాణపై చూపెట్టడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ స్థితిలో అర్భాటపు ప్రచారం, సభల కంటే రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నిజాయితీతో సహకరించి, నిధులు విడుదల చేసినప్పుడే ప్రజల్లో సానుకూలత నెలకొంటుందంటున్నారు.
రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాలు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో అంతర్గత విభేదాల కారణంగా పార్టీ ఆశించిన స్థాయిలో పురోగమించడంలేదనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ కారణంగానే ఎన్నికల్లో సైతం కేంద్రం నాయకత్వం అంచనాలను చేరుకోవడంలేదంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, లోక్ సభ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎంపీలు గెలిచారని, రానున్న రోజుల్ల రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రకటిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక లోపించిందంటున్నారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు అవకాశం కల్పించారు. ఈ ఇద్దరికి పొసగని పరిస్థితి ఉన్నది. ఎంపీల్లో పాత బీజేపీ నాయకులు, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన ఈటల, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, అర్వింద్ తదితరుల మధ్య కూడా అనైక్యత ఉందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల్లో కూడా విభేదాల కారణంగా అధికార కాంగ్రెస్ పార్టీని ఢీ కొనడంలో విఫలమవుతున్నారనే అభిప్రాయాలున్నాయి. ఇక నూతనంగా రామచందర్రావును పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించినప్పటికీ రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాల వరకు బీజేపీలో గ్రూపుల వల్ల అనైక్యత నెలకొందంటున్నారు. ఈ ప్రభావం పార్టీపై కనబరుస్తోందంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి కాయకల్ప చికిత్సచేసి రాష్ట్రంలో ఎలా? పట్టాలెక్కిస్తారనే చర్చ సాగుతోంది. ప్రధాని మోదీ పర్యటనతోనైనా పార్టీ గాడిలో పడుతుందా? అనే ఆసక్తి ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఈ కారణంగానే బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణితో లోపాయకారిగా మసలుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మోదీ పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి పై ఫోక్సో కేసు నమోదు కావడంతో పార్టీకి నష్టం వాటిల్లినట్లు చర్చసాగుతోంది. పర్యటన నుంచి బండిని తప్పించారని చెబుతున్నారు.
అభివృద్ధి పనుల ప్రారంభం
మోదీ పర్యటనలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని చెబుతున్నారు. ఈ మేరకు రైల్వే ప్రాజెక్టులతో పాటు ఎంఎంటీఎస్ జాతికి అంకితం చేస్తారని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభిస్తారని ప్రకటించారు. బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభం, ములుగులో – సమ్మక్క, సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం, జహీరాబాద్ పారిశ్రామిక పార్క్, వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ తో పాటు పలు నేషనల్ హై వే పనులు ప్రారంభించనున్నారు. మోదీ రాక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను కలిసి రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టుల పై విన్నవించనున్నట్లు సమాచారం. అభివృద్ధి పనులు, సభ అనంతరం మోదీ తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మోదీ రాక సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
