విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను ఐదింటికి అభ్యర్థులను ప్రకటించింది. గజ్వేల్ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి మంత్రిగా మెదక్ ఉమ్మడి జిల్లాపై చెరగని ముద్ర వేసుకున్న మాజీమంత్రి గీతా రెడ్డికి తొలిజాబితాలో చోటు దక్కలేదు. దీంతో ఆమె జిల్లా రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం కానున్నారని పార్టీ శ్రేణుల్లో ప్రచారం సాగుతోంది.
గతంలో గీతా రెడ్డి ప్రాతినిధ్యం వహించిన జహీరాబాద్ నుంచి అనూహ్యంగా వికారాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కు టికెట్ కేటాయించారు. గీతా రెడ్డి 2 పర్యాయాలు మంత్రిగా పనిచేసి జిల్లాపై చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతానికి మెదక్ జిల్లా రాజకీయాల నుంచి దూరం అయ్యారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ లో ఉంటారా లేదా అనేది చర్చనీయాశమైంది. అందోల్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు కేటాయించారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి సిటింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కే టికెట్ దక్కింది.
పంతం నిలబెట్టుకున్న మైనంపల్లి
మాల్కాజిగిరి బీఆరెస్ రెబల్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ లో చేరి పంతం నిలబెట్టుకున్నారు. తనకు కావాల్సిన రెండు టికెట్లను దక్కించుకున్నారు. మెదక్ నుండి కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు కాంగ్రెస్ టికెట్ దక్కింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి 2 టికెట్ల దక్కించుకుని జాక్ పాట్ కొట్టారు. బీఆర్ఎస్ లో 2 టికెట్లు కావాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పట్టుబట్టారు.
మల్కాజిగిరికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ మైనంపల్లి హన్మంతరావు కు కేటాయించింది. కుమారుడు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం పట్టుబట్టారు. మెదక్ సిటింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో మంత్రి హరీష్ రావు టికెట్ అడ్డుకున్నారని పలు ఆరోపణలు చేసి, పార్టీకి మైనంపల్లి హన్మంతరావు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన ఆయన కుటుంబానికి ఆపార్టీ 2 టికెట్లు కేటాయించింది. రోహిత్ కు మెదక్ నుంచి, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కు మల్కాజి గిరి టికెట్ కేటాయించింది. దీంతో మెదక్ జిల్లాలో ఇద్దరు కొత్త అభ్యర్థులకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినట్లైంది.
మరో ఐదు స్థానాలకు పెండింగ్
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నార్సారెడ్డిని కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలిపింది. మొదటి జాబితాలోనే నర్సారెడ్డికి కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. నర్సారెడ్డి ఎంపీపీగా, జడ్పీటీసీ, ఎమ్మెల్యేగా పదవులు అలంకరించారు. ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండడంతో పార్టీ టికెట్ ఆయనకు దక్కింది.
ప్రస్తుతం సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఇదిలావుండగా నర్సాపూర్, దుబ్బాక, సిద్దిపేట, పటాన్ చెరు, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటించలేదు. రెండు రోజుల్లో పార్టీ తుది జాబితా వెలువడనుందని ఆవర్గాల్లో చర్చ నడుస్తోంది.