New Online Scam | ఓటీపీ లేకుండానే ఈ సిమ్ సృష్టి.. కొత్త ఆన్‌లైన్ స్కామ్.. ఏంటది?
ఆన్‌లైన్‌లో రోజుకో కొత్త మోసం వెలుగు చూస్తున్నది. ఎంత భద్రంగా ఉన్నా.. ఎవడో ఒకడు.. ఏదో రూపంలో మోసాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఒక కొత్త ఆన్‌లైన్ స్కామ్ బయటపడింది. దీని బారినపడిన హైదరాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

హైదరాబాద్: ఆన్‌లైన్‌లో రోజుకో కొత్త మోసం వెలుగు చూస్తున్నది. ఎంత భద్రంగా ఉన్నా.. ఎవడో ఒకడు.. ఏదో రూపంలో మోసాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఒక కొత్త ఆన్‌లైన్ స్కామ్ బయటపడింది. దీని బారినపడిన హైదరాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇటీవల లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. స్కామర్‌లు అతడిపేరుతో గుర్తు తెలియని ఒక ఈ సిమ్‌ను సృష్టించారు. అదికూడా ఓటీపీ లేకుండానే. ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరస్తుల కొత్త ఎత్తుగడలకు ఇది తాజా నిదర్శనంగా నిలుస్తున్నది.
బాధితుడికి గుర్తు తెలియని వాట్సాప్ నంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అందులో ‘కస్టమర్ సపోర్ట్’ పేరిట ఏపీకే ఫైల్ లింకు ఒకటి వచ్చింది. కొత్త క్రెడిట్ కార్డు పొందేందుకు సహాయం కోసం డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా ఆ మేసేజ్ పంపిన వ్యక్తి కోరాడు. అది లీగల్‌గా వచ్చిన రిక్వెస్టుగా భావించిన బాధితుడు.. దానిని డౌన్‌లోడ్ చేసి తన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నాడు. ఏపీకే ఫైల్ ఇన్‌స్టాల్ కాగానే.. బాధితుడి ఫోన్‌లో నిక్షిప్తమైన కీలక సమాచారం స్కామర్స్ యాక్సెస్‌లోకి వచ్చింది. కొత్త క్రెడిట్ కార్డు కోసం వివరాలు ఇవ్వాలంటూ బాధితుడిని మభ్యపెట్టిన సైబర్ నేరస్తులు.. అన్ని వివరాలు తెలుసుకున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా బాధితుడు తన మొబైల్ నెట్‌వర్క్ నుంచి తనకు తెలియకుండానే డిస్‌కనెక్ట్ అయిపోయాడు. ఫోన్ పనిచేయలేదు. కాల్స్ వెళ్లలేదు.. ఎస్‌ఎంఎస్ కూడా యాక్సెస్‌లో లేకుండా పోయింది.
బాధితుడి ఫోన్ నుంచి కీలక సమాచారం రాబట్టిన సైబర్ నేరగాళ్లు.. వేరే ఫోన్ నుంచి అతడి నెంబర్‌తో ఈ సిమ్‌ను యాక్టివేట్ చేశారు. సాధారణంగా వచ్చే ఓటీపీ లేకుండానే ఈసిమ్ క్రియేట్ అయింది. ఇక సైబర్ నేరగాళ్లు బాధితుడి నెంబర్‌కు వచ్చే మెసేజ్‌లు, కాల్స్ వేరే నంబర్‌కు మళ్లించారు. దాంతో ఆయన ఫోన్‌కు వచ్చే ఓటీపీలు, ఇతర ఆర్థిక పరమైన లావాదేవీలను ఇంటర్‌సెప్ట్ చేశారు. కొద్ది సమయంలోనే బాధితుడి నుంచి 1,06,650 రూపాయలు కొట్టేశారు. బాధితుడు తన నెట్‌వర్క్ కనెక్టివిటీని తిరిగి పొంది, బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను చూసుకున్నాక గానీ ఈ విషయం తెలియలేదు.
ఈ సిమ్ స్కామ్‌కు గురికావొద్దంటే..
అవాంఛిత మెసేజ్‌లు, డౌన్‌లోడ్ లింకుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఉదంతం మరోసారి తెలియజేస్తున్నది. ఇలాంటి స్కామ్‌ల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అందుకు నిపుణులు కొన్ని సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వాటిని మరోసారి వ్యక్తిగతంగా ధృవీకరించుకుని పాటించాలని సూచిస్తున్నారు.
అన్నింటికంటే అత్యంత ముఖ్యమైనది గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ తదితర ప్లాట్‌ఫారాల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్ లేదా సాఫ్ట్‌వేర్ లింకులను ఎట్టిపరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయకూడదు. ఇలాంటి ఫైల్స్‌లో మాల్వేర్ ఉండొచ్చు. అది మీ మొబైల్ భద్రతను ప్రమాదంలో పడేస్తుంది.
మిమ్మల్ని కాంటాక్ట్ చేసే వ్యక్తులు లేదా సంస్థల గుర్తింపును వ్యక్తిగతంగా తనిఖీ చేసుకోవాలి. ప్రత్యేకించి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం కోరుతూ వచ్చే సందేశాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. భద్రతలేని చానళ్ల ద్వారా సున్నితమైన, లేదా రహస్యంగా ఉండాల్సిన ఎలాంటి సమాచారాన్ని చట్టబద్ధమైన కంపెనీలు కోరవు అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి.
క్రెడిట్ కార్డు తదితర కొత్త సర్వీసుల కోసం దరఖాస్తు చేసే సమయంలో సంబంధిత బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ఉపయోగించాలి. స్వయంగా సదరు బ్రాంచ్‌లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవడం అత్యుత్తమం. మెసేజ్‌లతోపాటు పంపే లింకులను క్లిక్ చేయడం మానుకోవాలి. చాలా సందర్భాల్లో ఫిషింగ్ వెబ్‌సైట్‌లు మీ సమాచారాన్ని కొట్టేయడానికి ఇటువంటి లింకులు పంపుతుంటాయి.