Riyaz Encounter | నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్
నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ పోలీసుల కాల్పుల్లో మృతిచెందాడు. ఆసుపత్రిలో తుపాకీ లాక్కునేందుకు యత్నించడంతో ఆత్మరక్షణలో పోలీసులు కాల్పులు జరిపారని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు.

Nizamabad Constable Murder Case Accused Riyaz Killed in Police Encounter
విధాత, నిజామాబాద్:
నిజామాబాద్‌లో కానిస్టేబుల్‌ను హత్య చేసిన వాహన దొంగ రియాజ్ (24) పోలీసుల కాల్పుల్లో మృతిచెందాడు. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ సోమవారం ఉదయం కానిస్టేబుల్ వద్ద నుంచి తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించడంతో, ఆత్మరక్షణలో పోలీసులు కాల్పులు జరిపారు. రియాజ్ మృతి విషయాన్ని నిజామాబాద్ కమిషనర్ నాగరాజు ధృవీకరించారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది.
ఈ నెల 17న వినాయక్‌నగర్ సీసీఎస్ స్టేషన్‌కు తరలిస్తుండగా, కానిస్టేబుల్ ప్రమోద్‌పై రియాజ్ కత్తితో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్నేహితుడి బైక్‌పై తప్పించుకున్న రియాజ్ మహ్మదీయ కాలనీకి వెళ్లి దుస్తులు మార్చుకుని నగరంలోనే తచ్చాడాడు. పోలీసులు డ్రోన్ కెమెరాల సాయంతో గాలింపు ప్రారంభించి, ఐదో పోలీస్ స్టేషన్ పరిధిలో కెనాల్‌లో బైక్‌ను గుర్తించారు.
ఆదివారం మధ్యాహ్నం సారంగాపూర్ శివారులో అతడు ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. లారీ క్యాబిన్‌లో దాక్కున్న రియాజ్ పారిపోవడానికి ప్రయత్నించగా స్థానికుడు సయ్యద్ ఆసిఫ్ అతడిని ఆపడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో రియాజ్ కత్తితో ఆసిఫ్‌పై కూడా దాడి చేసి గాయపరిచాడు. పోలీసులు వెంటనే రియాజ్‌ను అదుపులోకి తీసుకుని, ఆసిఫ్‌ను ఆస్పత్రికి తరలించారు.
సోమవారం ఉదయం ఆసుపత్రిలో ఉన్న రియాజ్ బాత్‌రూమ్ నుంచి తిరిగి వస్తూ కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు.
డీజీపీ శివధర్‌రెడ్డి వివరణ
తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఈ ఘటనపై స్పందించారు.
“రియాజ్ పోలీసులపై మరోసారి దాడికి ప్రయత్నించాడు. ఆసుపత్రిలో ఉన్నపుడు గన్ లాక్కుని కాల్పులకు యత్నించాడు. పోలీసులు ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సమయస్ఫూర్తిగా చర్యలు తీసుకున్నారు. రియాజ్ కాల్పులు జరిపి ఉంటే ఆసుపత్రిలో ఉన్న అనేక మంది ప్రాణాలు పోయేవి,” అని డీజీపీ తెలిపారు.
ఆదివారం జరిగిన ఘర్షణలో గాయపడిన కానిస్టేబుల్ సయ్యద్ ఆసిఫ్‌కు ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స అందిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
కానిస్టేబుల్ ప్రాణాలు తీసి.. చివరికి రియాజ్ అంతం
వాహన దొంగతనాల్లో నిందితుడిగా ఉన్న రియాజ్ కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు. అతడిని పట్టుకునేందుకు తొమ్మిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు చివరకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
చికిత్స సమయంలోనే రియాజ్ మరోసారి దాడికి యత్నించడంతో, పోలీసుల కాల్పుల్లో అతని జీవితం ముగిసింది.