సూరంపేటలో సుంకెకు నో ఎంట్రీ..
గంటన్నర సేపు ఊరి పొలిమేరల్లోనే.. ఎవరి పర్మిషన్ తీసుకొని వస్తున్నారని నిలదీసిన గ్రామస్థులు.. బతిమాలుకొని గ్రామంలోకి వచ్చిన బి.ఆర్.ఎస్. అభ్యర్థి..

గంటన్నర సేపు ఊరి పొలిమేరల్లోనే..
ఎవరి పర్మిషన్ తీసుకొని వస్తున్నారని నిలదీసిన గ్రామస్థులు..
బతిమాలుకొని గ్రామంలోకి వచ్చిన బి.ఆర్.ఎస్. అభ్యర్థి
దమ్మాయిపేటలో నిరుద్యోగుల నిరసన
కోనాపూర్ లో అడ్డుకున్న గ్రామస్థులు
చొప్పదండి బి.ఆర్.ఎస్. అభ్యర్థి సుంకె రవిశంకర్ కు ప్రచార పర్వంలో ప్రజల నుండి నిరసన సెగ తప్పడం లేదు. ఏ గ్రామానికి వెళ్లినా స్థానికుల నుండి వస్తున్న వ్యతిరేకత ఆయనను కలవరానికి గురిచేస్తోంది. కొడిమ్యాల మండలం సూరంపేట, దమ్మాయిపేట, కోనాపూర్ గ్రామాలలో రవి శంకర్ మంగళవారం ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు స్థానికులు షాక్ ఇచ్చారు. సూరంపేట గ్రామంలోకి వెళ్ళడానికి బి.ఆర్.ఎస్. అభ్యర్థి నానా తంటాలు పడాల్సి వచ్చింది. గంటన్నరసేపు ఆయన ఊరి పొలిమేరల్లోనే ఉండిపోయి, గ్రామంలోకి వెళ్ళడానికి స్థానికులను అభ్యర్థించాల్సిన దుస్థితి దాపురించింది. తన అనుమతి లేకుండా ఇంటికి ఎందుకు వచ్చారని గతంలో గ్రామస్థులను వెళ్లగొట్టిన రవి శంకర్ పై స్థానికులు ఎన్నికల ప్రచారం సందర్భంగా రివెంజ్ తీసుకున్నారు. ఊరి పొలిమేరల్లోకే తమ పార్టీ కార్యకర్తలను పిలిపించుకున్న రవి శంకర్ గ్రామ ప్రజలు తనను ఊరేగింపుగా తీసుకువెళ్లే ఏర్పాటు చేయాలని ప్రాధేయపడ్డారు. విషయం తెలిసిన గ్రామ పెద్దలు ఎమ్మెల్యేను గ్రామంలోకి ఎలా తీసుకువస్తారని బి.ఆర్.ఎస్. కార్యకర్తలపై మండిపడ్డారు. గ్రామంలోకి రావడానికి ఆయనకు ఎవ్వరు అనుమతి ఇచ్చారంటూ వారిని నిలదీశారు. చివరకు స్థానిక జెడ్.పి.టి.సి. కృష్ణా రావు తదితరులు గ్రామస్థులను బుజ్జగించడంతో సుంకె ఆ గ్రామంలోకి వెళ్ళడానికి మార్గం సుగమం అయ్యింది. దేశాయిపేట గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలోనూ బి.ఆర్.ఎస్. అభ్యర్థికి చుక్కెదురయ్యింది. నిరుద్యోగ సమస్య, ఉద్యోగాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాల లీకేజీపై యువకులు ఆయనను నిలదీశారు. గత ఎన్నికల్లో గెలుపొందిన తరువాత ఏనాడు తమ గ్రామానికి వచ్చారంటూ స్థానికులు ప్రశ్నల వర్షం కురిపించారు. పోతారం చెరువు బ్యాక్ వాటర్ కారణంగా గ్రామంలోకి రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నా వంతెన నిర్మాణానికి ఎందుకు చొరవ చూపలేదని మండిపడ్డారు. కోనాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బి.ఆర్.ఎస్. అభ్యర్థిని స్థానికులు అడ్డుకున్నారు. తమ గ్రామంలోకి రావడానికి కనీసం రహదారి సౌకర్యం సరిగా లేదని అయినా అయిదేండ్లుగా శాసనసభ్యుడికి పట్టింపు లేకుండా పోయిందని మండిపడ్డారు.

బి.ఆర్.ఎస్.ను వీడుతున్న ప్రజాప్రతినిధులు..
చొప్పదండి నియోజకవర్గంలో శాసనసభ్యుడు కొంతమంది చేతుల్లో బందీ అయిపోయారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల పట్ల చొరవ చూపని రవి శంకర్ తీరుకు నిరసనగా పలువురు అధికార పార్టీ నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. మల్యాల మండలంలో పోతారం సర్పంచ్ హరీష్ తో పాటు మరో నలుగురు మాజీ సర్పంచులు, ఇద్దరు ఎం.పి.టి.సి. సభ్యులు ఇప్పటికే అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు. చొప్పదండి మండలంలో దేశాయిపేట ఎం.పి.టి.సి. కూకట్ల తిరుపతి, మాజీ సర్పంచ్ కనకం జక్కన్న, రాగంపేట మాజీ సర్పంచ్ జెర్రిపోతుల వెంకటయ్య, రామడుగు మండలం రంగసాయిపల్లి సర్పంచ్ పద్మ అధికార పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. చొప్పదండి మండలంలోనే రుక్మాపూర్ సర్పంచ్ చిలుక లింగయ్య, చాకుంట ఎం.పి.టి.సి. గోపు మంగ గులాబీ గూటికి గుడ్ బై చెప్పారు. తాజాగా బుధవారం చొప్పదండి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు మునిగాల విజయ లక్ష్మి చందు అధికార పార్టీని వీడి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
సుంకె ప్రచారంలో కనిపించని ట్రస్మా..
ఎన్నికలు ఏవైనా అధికార పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేసే తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) సభ్యులు చొప్పదండి నియోజకవర్గంలో ఈసారి ఆ పార్టీ అభ్యర్థి ప్రచారంలో ఎక్కడా కానరావడం లేదు. పాఠశాల యాజమాన్య ప్రతినిధి కూడా అయిన సుంకె గెలుపు కోసం గత ఎన్నికల్లో ట్రస్మా సభ్యులు శక్తివంచన లేకుండా కృషి చేశారు. కానీ ఆయన వ్యవహారశైలి, తమను పెద్దగా పట్టించుకోని తీరుకు నిరసనగా వారు ఈ ఎన్నికల్లో మొఖం చాటేశారు. చొప్పదండి నియోజకవర్గంలో నలభైకు పైగా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు ఉన్నాయి. ఎన్నికల్లో వీరి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. దీంతో వారిని మచ్చిక చేసుకునేందుకు బి.ఆర్.ఎస్. అభ్యర్థి ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడితో చేయించిన ప్రయత్నాలు ఫలించలేదు. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు చూసి అధికార పార్టీ శ్రేణులు డీలా పడిపోతున్నారు.