Bhatti Vikramarka | పరీక్షల వాయిదా లేదు.. 6వేల పోస్టులతో మరో డీఎస్సీ :డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్రంలో ఇప్పటికే ప్రకటించిన పోటీ పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తి లేదని, నిరుద్యోగులు డిఎస్సీకి సన్నద్ధం కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుత డీఎస్సీతో 11వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయబోతున్నామని, త్వరలో 6వేల పోస్టులతో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు.

Bhatti Vikramarka | పరీక్షల వాయిదా లేదు.. 6వేల పోస్టులతో మరో డీఎస్సీ :డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటికే ప్రకటించిన పోటీ పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తి లేదని, నిరుద్యోగులు డిఎస్సీకి సన్నద్ధం కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుత డీఎస్సీతో 11వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయబోతున్నామని, త్వరలో 6వేల పోస్టులతో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే ఉద్యోగాల కోసమని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగయువతపైనే దృష్టి కేంద్రీకరించామని, మొదటి మూడు నెలల్లోనే 30వేల మందికి నియామక పత్రాలు ఇచ్చామని స్పష్టం చేశారు. మరో 13,321 మంది ఉద్యోగుల నియామక ప్రక్రియ చివరి దశకు చేరింది.. ఇందులో గురుకుల పీఈటీ, అసిస్టెంట్ ఇంజనీర్లు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ లెక్చరర్లు, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయని, మిగిలిన ఉద్యోగాలు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. అధికారంలోకి రాగానే 16వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్టు గుర్తించామని, 11 వేల టీచరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. 19,717మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, 34 వేల మందిని బదిలీ చేశామని తెలిపారు. ఈనెల 11 నుంచి డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులో ఉంచామని, కొన్ని నెలలుగా అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారని, జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి, ధర్నాలు చేస్తున్నారని, పదేళ్లలో ఎన్నడూ గ్రూప్-1 నిర్వహించలేదని, గ్రూప్-2ను ఇప్పటికే లీకేజీలతో 3 సార్లు వాయిదా వేశారని, పరీక్షలు అన్ని సార్లు వాయిదా వేయడం సరికాదన్నారు. త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వడమే మా లక్ష్యమన్నారు. ఆగస్టులో గ్రూప్ 2, 3 పరీక్షలు నిర్వహించేందుకు తేదీలు ఖరారు చేశామని చెప్పారు. హాస్టల్ వెల్ఫేర్‌కు సంబంధించి 581 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య లేఖ పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ బిడ్డలు జీవితాల్లో స్థిరపడాలనేదే మా ప్రభుత్వం ఆకాంక్ష అని, డీఎస్సీ కి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు బాగా పరీక్షలు రాసి త్వరితగతిన ప్రభుత్వ పాఠశాలల్లోని పేద బిడ్డలకు పాఠాలు చెప్పాలనేది మా ప్రభుత్వం కోరిక అని భట్టి స్పష్టం చేశారు.