విధాత : కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటికి శనివారం బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేరుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. పొన్నాల ఇంటికెళ్లిన కేటీఆర్ ఆయను బీఆరెస్‌లోకి ఆహ్వానించారు. ఈ నెల 16న జరిగే కేసీఆర్ వరంగల్ సభలో పొన్నాల బీఆరెస్ పార్టీలో చేరుతారని కేటీఆర్ ప్రకటించారు. బీఆరెస్‌లో పొన్నాలకు తగిన గౌరవం, సముచిత ప్రాధాన్యం ఇస్తామన్నారు.
ఎంతో ఉన్నత విద్యను అభ్యసించి, మంత్రిగా, పార్టీ చీఫ్‌గా పనిచేసిన పొన్నాల వంటి నాయకుడిని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తులనాడిన తీరు చూసి ఎవరైనా చీదరించుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. అసలు రేవంత్ బీజేపీ, ఆర్‌ఎస్‌స్, తర్వాతా టీఆరెస్, టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారన్నారు. అటువంటి రేవంత్ రెడ్డి 45 ఏళ్లు కాంగ్రెస్‌లో పనిచేసిన సీనియర్ నేత పొన్నాల వంటి నాయకులను అవమానించడం సరికాదన్నారు.
సచ్చే ముందు పార్టీమారుతారా అంటూ పొన్నాలను విమర్శించిన తీరు రేవంత్ చిల్లర మాటలకు నిదర్శనమన్నారు. ఓటుకు నోటు దొంగను కనపు సింహాసనం మీద శునకంను కూర్చోబెట్టినట్లుగా పీసీసీ చీఫ్ పోస్టులో పెట్టారని, పార్టీ టికెట్లను అమ్ముకుంటున్న రేవంత్ తీరుతో విబేధించి పొన్నాల ఆ పార్టీని వీడారన్నారు. జనగామా టికెట్ పొన్నాలకు ఇస్తారా అన్నదానిపై ఆయనకు ఏ టికెట్ ఇస్తారా ఏమిటన్నదానిపై సీఎం కేసీఆర్ మాట్లాడుతారన్నారు.
కేసీఆర్‌తో భేటీ
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్వయంగా నా ఇంటికి వచ్చి నన్ను బీఆరెస్‌లో చేరాలన్న ఆహ్వానించడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఆదివారం కేసీఆర్‌ను కలిశాకా అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు. తనపై రేవంత్ రెడ్డి చేసిన విమర్శల పట్ల పొన్నాల తీవ్ర ఆగ్రహంతో స్పందించారు. నావంటి సీనియర్ నేతను రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడటానికి ఎంత ధైర్యమన్నారు.
కాగా.. నీ నాయకత్వంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఓట్లు వచ్చాయని, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రాలేదన్నారు. కాంగ్రెస్ నుంచి కనీసం అసెంబ్లీకి కూడా రేవంత్ ఎన్నిక కాలేదన్నారు. నేను రెండుసార్లు ఓడిపోయానంటున్న రేవంత్ నాలాగే పార్టీకి చెందిన కోమటిరెడ్డి, జానారెడ్డి సహా చాల మంది సీనియర్లు ఓడిపోయారని, మరి వారి గూర్చి ఎందుకు మాట్లాడటం లేదంటూ నిలదీశారు. కాంగ్రెస్‌ను రేవంత్ రెడ్డి వంటి వాళ్లు వచ్చి భ్రష్టపటిస్తున్నారన్నారు.