Sitarama project | పంప్‌హౌజ్‌లో నీళ్లు వచ్చే ఫోటోలు పెడితేనే సీఎం కార్యక్రమం
సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌజ్‌లో నీళ్లు వచ్చే ఫోటోలు పెడితేనే ఈ నెల 15న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ, ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉంటుందని లేదంటే ఉండదని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

అధికారుల తీరుపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ అసహనం
విధాత, హైదరాబాద్ : సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌజ్‌లో నీళ్లు వచ్చే ఫోటోలు పెడితేనే ఈ నెల 15న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ, ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉంటుందని లేదంటే ఉండదని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం సీతారామ ప్రాజెక్టు పుసుగూడెం పంప్‌హౌజ్ ట్రయల్ రన్ ప్రారంభించిన అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీతారామ పంప్‌హౌజ్ నీళ్లు మోటార్లు నడపడానికి సరిపోతాయా అని ప్రాజెక్టు అధికారులను ప్రశ్నించారు. వారు పరస్పరం పొంతనలేని సమాధానాలు చెప్పడంతో మంత్రి ఉత్తమ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. స్వయంగా సీఎం మూడు రోజుల్లో ప్రారంభించాల్సిన ప్రాజెక్టుపై ఇంత అశ్రద్ధ ఏమిటంటూ మండిపడ్డారు. పంప్‌హౌజ్‌లో నీళ్లు వచ్చే ఫోటోలు పెడితేనే సీఎం కార్యక్రమం పెడుతామని స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకుందన్నారు. భూసేకరణలో రైతులు ప్రభుత్వానికి సహరించి ప్రాజెక్టు పూర్తికి సహకరించాలన్నారు. పాలేరు లింక్ కెనాల్ టెండర్లు కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. సీతారామ లిఫ్ట్‌ల పనులన్నింటిని అధికారులు రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా వేగవంతం చేయాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణ అనుమతులు తుది దశకు చేరుకున్నాయని, గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు వద్దకు చేరాయని మంత్రి ఉత్తమ్ ప్రస్తావించారు. అదే సమయంలో సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల అనుమతులపై దృష్టి సారించి సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు. కాలువల నిర్మాణానికి అడ్డుగా ఉన్న రైల్వే క్రాసింగ్ ల వద్ద నిర్మాణాలు ఆగకుండా అ శాఖాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.