పానీపూరీ ఎఫెక్ట్… చిన్నారులకు అస్వస్థత

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ లో పానీపూరీ తిన్న 18మంది బాలురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.

ఆహార ప్రియులను నోరూరించే పదార్దాలలో పానీపూరీ ఒకటి. అయితే పానీపూరీని తయారు చేసే క్రమంలో అపరిశుభ్రత, నాసిరకం పదార్ధాల వినియోగం, కలుషిత నీళ్ల వాడకం వంటి వాటితో పానీపూరీ అంటేనే భయపడే పరిస్థితులు ఎక్కువగా నెలకొంటున్నాయి. టైఫాయిడ్, అతిసార వంటి వాటికి ప్రధాన కారణాల్లో పానపూరీ కూడా ఒకటిగా తేలింది. అయినప్పటికి పానీపూరీ ప్రేమికులు అది కంటపడగానే దానిని తినేందుకు ఆసక్తి చూపడం మానడం లేదు.

తాజాగా 18మంది చిన్నారులు పానీపూరీ తిని కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ఘటన వెలుగు చూసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ లో ఈఘటన చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన చిన్నారుల్లో రిషీకేశ్ అనే పిల్లవాడికి ఫిట్స్ రావడంతో ఆందోళన నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉన్న పానీపూరి బండివద్ద మంగళవారం సాయంత్రం కొందరు చిన్నారు పానీపూరి తిన్నారు. ఇది తిన్న కాసేపటికే కొందరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరు తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా.. మరి కొందరు వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

పానీపూరి తినడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా.. అనే దానిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులందరికీ ఒకే తరహా లక్షణాలు కనిపించడంతో ఫుడ్ పాయిజన్ అయ్యి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారులు పానీపూరీ బండి నుంచి ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి టెస్టింగ్ కు పంపించారు.

Latest News