బిర్యానీ తర్వాత పుచ్చకాయ తిన్నారు.. అంతే.. కుటుంబం మొత్తం చనిపోయారు!
ముంబైలో బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిన్న కుటుంబంలోని నలుగురు సభ్యులు 12 గంటల్లో మృతి చెందారు. ఫుడ్ పాయిజనింగ్ అనుమానంతో పోలీసులు, ఫుడ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ముంబైలో బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత 12 గంటల్లో మృతి చెందిన కుటుంబ సభ్యులు.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Biryani Dinner, Watermelon Later: Mumbai Family Of Four Dies Within Hours
- ముంబైని కుదిపేసిన మహా విషాదం.. అసలు కారణంపై మిస్టరీ
Biryani – Watermelon Horror | మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు కేవలం 12 గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం నగరాన్ని షాక్‌కు గురిచేసింది. మొదట ఇది సాధారణ అస్వస్థతగా భావించినా.. కొద్దిసేపటికే పరిస్థితి విషమించి వరుస మరణాలు సంభవించాయి. బిర్యానీ తిన్న తర్వాత కాసేపటికి పుచ్చకాయ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అయితే అసలు కారణం ఏమిటన్నది ఇంకా తేలలేదు.
మృతులను అబ్దుల్లా డోకాడియా (40), ఆయన భార్య నస్రీన్ డోకాడియా (35), కుమార్తెలు అయేషా (16), జైనబ్ (13)గా గుర్తించారు. పైధోనీ ప్రాంతంలో నివసిస్తున్న ఈ కుటుంబం స్థానికంగా మంచి పేరు ఉన్న కుటుంబంగా తెలిసింది. అబ్దుల్లా మొబైల్ యాక్సెసరీస్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఆ రాత్రి ఏమైంది?.. గంట గంటకో విషాదం
ఏప్రిల్ 25 రాత్రి ఈ కుటుంబం బంధువులతో కలిసి విందు భోజనం చేసింది. మొత్తం తొమ్మిది మంది కలిసి రాత్రి 10.30 ప్రాంతంలో బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత బంధువులు తమతమ ఇళ్లకు వెళ్లిపోయారు. తర్వాత రాత్రి 1 గంట ప్రాంతంలో వీరందరు పుచ్చకాయ ముక్కలు తిన్నట్లు పోలీసులు తెలిపారు.
అప్పుడు ఎలాంటి అస్వస్థత లక్షణాలు కనిపించలేదు. కానీ తెల్లవారుజామున 5 గంటల తర్వాత ఒక్కసారిగా నలుగురికీ వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్ లక్షణాలు మొదలయ్యాయి. పరిస్థితి వేగంగా క్షీణించడంతో మొదట కుటుంబ వైద్యుడిని సంప్రదించారు. తన సూచన మేరకు వెంటనే జేజే ఆస్పత్రికి తరలించారు.
అయితే చికిత్స పొందుతూ ఉదయం 10.15 గంటల సమయంలో ముందుగా చిన్న కుమార్తె జైనబ్ మృతి చెందింది. అనంతరం పెద్ద కుమార్తె అయేషా, తల్లి నస్రీన్ కూడా చికిత్సకు స్పందించలేదు. చివరికి రాత్రి 10.30 గంటల సమయంలో కుటుంబ పెద్ద అబ్దుల్లా కూడా కన్నుమూశారు. ఇలా కేవలం 12 గంటల్లోపు కుటుంబమంతా మరణించడం అందరినీ కలచివేసింది.
పుచ్చకాయపై అనుమానం.. బిర్యానీపై కూడా దర్యాప్తు
ఈ ఘటనలో పోలీసులు ఇంట్లో మిగిలి ఉన్న సగంతిన్న పుచ్చకాయ ముక్కను స్వాధీనం చేసుకున్నారు. దానిని ఫుడ్ ల్యాబ్‌కు పంపించారు. పుచ్చకాయలో విషపదార్థం ఉందా? బయట నుంచి ఏదైనా కెమికల్ లేదా కల్తీ పదార్థం చేరిందా? అనే అంశాలపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పరిశీలిస్తున్నారు.
అదే సమయంలో బిర్యానీ కూడా అనుమానాస్పదంగా భావిస్తున్నారు. ఎందుకంటే భోజనం తర్వాత కొద్ది గంటల్లోనే లక్షణాలు కనిపించాయి. అయితే అదే బిర్యానీ తిన్న బంధువులకు ఎలాంటి సమస్యలు రాకపోవడం కొత్త సందేహాలకు దారితీసింది.
వైద్యులు ఏమంటున్నారు?
మొదట వీరిని పరీక్షించిన డాక్టర్ జియాద్ ఖురేషీ మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చే సమయానికి తీవ్ర నీరసం, అధిక వాంతులు, విరేచనాలతో ఉన్నారని తెలిపారు. శరీరంలో నీరు పూర్తిగా తగ్గిపోయినట్లు కనిపించిందన్నారు. వేగంగా టాక్సిన్ ప్రభావం లేదా తీవ్రమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉండే అవకాశాన్ని వైద్యులు పరిశీలిస్తున్నారు.
తుది నివేదిక కోసం ఎదురుచూపులు
పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం పరీక్షలు పూర్తయ్యాయి. శరీర భాగాల నమూనాలు, ఫుడ్ సాంపిల్స్, మైక్రోబయాలజీ పరీక్షలు, హిస్టోపథాలజీ రిపోర్టులు వచ్చిన తర్వాతే అసలు మరణ కారణం వెల్లడవుతుందని అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో ముంబైలో ఫుడ్ సేఫ్టీ, బయట ఆహారం, కట్ చేసిన పండ్లు కొనుగోలు చేసే విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram