విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశాన్ని భారీ మెజార్టీతో గెలిపించి, సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాలని ఆపార్టీ సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం నకిరేకల్ బైపాస్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అంతమొందించాలని కోరారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని ఖతమైందన్నారు. రాబోవు ఎన్నికల్లో మతతత్వ బీజేపీకి, అరాచక పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఓటేయండి: వేముల వీరేశం
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఓఫక్షన్ హాల్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఓగోడ్ గ్రామ మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు, సుమారు 200 మంది అనుచరులు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి, మాజీ ఎమ్మెల్యే వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అనంతరం వీరేశం మాట్లాడుతు కొత్త పాత తేడా లేకుండా పార్టీ కోసం కష్టపడ కార్యకర్తలను కాపాడుకుంటానన్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ 12 స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అంతా ఉత్త మాటలేనని, కాంగ్రెస్ మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తుందన్నారు. ప్రతి గడపకూ వెళ్లి కాంగ్రెస్ గ్యారంటీ పథకాలను ప్రచారం చేయాలని కోరారు. రాష్ట్రంలో ఏఒక్క పరీక్ష కూడా సరిగా నిర్వహించలేని అసమర్థ నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు.