Kaleshwaram: కాళేశ్వరం కుంభకోణంలో.. అసలు ముద్దాయి ఎవరో చెప్పిన పొంగులేటి!

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో అసలు ముద్దాయి ఎల్ అండ్ టీ కంపెనీ అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఎల్అండ్‌టి‌ని ఎవరు నడిపించారో.. అంద‌రికీ తెలుసున‌ని వ్యాఖ్యానించారు

Kaleshwaram: కాళేశ్వరం కుంభకోణంలో.. అసలు ముద్దాయి ఎవరో చెప్పిన పొంగులేటి!

Kaleshwaram:

హైద‌రాబాద్‌, (విధాత‌): కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో అసలు ముద్దాయి ఎల్ అండ్ టీ కంపెనీ అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఎల్అండ్‌టి‌ని ఎవరు నడిపించారో.. అంద‌రికీ తెలుసున‌ని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌ పార్టీని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా బుద్ధి రాలేదని మండిపడ్డారు. కాళేశ్వ‌రం క‌మిష‌న్ స్వతంత్రంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. త‌మ ఆధీనంలో ఉన్న‌ట్ల‌యితే తొలి ముద్దాయిని ఎప్పుడో విచార‌ణ‌కు పిలిపించేవాళ్ల‌మ‌ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ అంబేద్క‌ర్ తెలంగాణ స‌చివాల‌యంలో శుక్ర‌వారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. పలు విషయాలపై చర్చించారు.

దబాయిస్తే తప్పు ఒప్పయితదా..

కాళేశ్వ‌రం ప్రాజెక్టు‌లో గ‌త పాల‌కులు చేసిన తప్పులు బయటపడ్డా దబాయిస్తే ఒప్పులు అయిపోతాయా అంటూ ప్రశ్నించారు. ఎల్ అండ్ టీ మోసాల‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారన్నారు. జ్యుడిషియ‌ల్ కమిషన్ రిపోర్ట్ ప్ర‌భుత్వానికి అంద‌గానే ఆమోదం తెలిపి అన్ని రిపోర్ట్‌లను బయట పెడతామ‌న్నారు. క‌మిష‌న్ నివేదిక‌పై మంత్రివ‌ర్గంలో చర్చించి చర్యలు తీసుకుంటామ‌న్నారు. శిశుపాలుని తప్పులు లెక్క ఇప్పటికే కేసీఆర్ చేసిన 99 తప్పులు పూర్తి అయ్యాయని.. కాళేశ్వరం వందో తప్పు అని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కనీస ప్రమాణాలు పాటించలేదు

క‌నీస ప్ర‌మాణాలు పాటించ‌కుండా, అనుమ‌తులు లేకుండా ఇష్టారాజ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని మండిపడ్డారు. న‌దిలో ప్ర‌వ‌హించే ఇసుకపై బ్యారేజి కడితే ప‌టిష్టంగా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తాము నిపుణులం కాదని.. కేసీఆర్‌ నిపుణుడు అయితే రిపోర్టును త‌యారు చేసి క‌మిష‌న్‌కు ఇవ్వాల‌న్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందే మేడిగ‌డ్డ కూలింది కాబ‌డ్డి స‌రిపోయింది, లేదంటే మేమే కూల్చామ‌ని దుష్ప్ర‌చారం చేసేవార‌న్నారు.

క‌విత తిరుగుబాటు టీ క‌ప్పులో తుఫాన్

కవిత సమస్య టీ కప్పులో తుఫాన్‌ లాంటిదని, ఆమె కాంగ్రెస్ లోకి వచ్చే అంశంపై మాట్లాడేంత పెద్ద నాయకుడిని కాదని, పార్టీలో నేను కార్యకర్తను మాత్రమేన‌ని పొంగులేటి స్ప‌ష్టం చేశారు. ఆమె పార్టీలో చేరినా, మంత్రి పదవి క‌ట్ట‌బెట్టినా… ఆ అంశంపై మాట్లాడే అర్హత త‌న‌కు లేద‌న్నారు. బీజేపీ లో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తారని కవిత అంటున్న విష‌యం మీడియాలో చూస్తున్నాన‌న్నారు. రాష్ట్ర మంత్రివ‌ర్గంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌రువాత తానెప్పుడు నెంబర్ 2 అని చెప్పలేదని స్ప‌ష్టం చేశారు.

మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీతో మంచి స్నేహం ఉందని, త‌న‌కంటే ఆయ‌న‌కే ఈడీ గురించి ఎక్కువ తెలుసున‌ని అన్నారు. కేటీఆర్ కు ఢిల్లీలో బీజేపీ పెద్ద‌ల‌తో మంచి దోస్తానా ఉందని, త‌న వ‌ద్ద‌కు ఈడీ అధికారులు ఎప్పుడూ రాలేదు.. నా కూతురు ఇంటికి వెళ్లిన విష‌యం వాస్త‌వ‌మ‌న్నారు. కాంగ్రెస్ అధినాయ‌కుడు రాహుల్ గాంధీ, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భేటీ అంశం మా పార్టీకి సంబంధించిన‌ద‌ని, ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రాహుల్ గాంధీని క‌చ్చితంగా కలవాలనేది నిబంధ‌న‌ల‌ లేదన్నారు. రాహుల్ తో రేవంత్ కు మంచి సంబంధాలు ఉన్నాయ‌ని మంత్రి పొంగులేటి స్ప‌ష్టం చేశారు.