నూతన ఆర్వోఆర్ చట్టం-2024 ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ
నూతన ఆర్వోఆర్ చట్టం-2024ముసాయిదాపై ఈ నెల 4వ తేదీన ఉదయం 10గంటలకు బేగంపేట టూరిజం ప్లాజాలో విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించనున్నట్లుగా తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్

4వ తేదీన టూరిజం ప్లాజాలో సదస్సు
తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసొసియేషన్ అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి
విధాత, హైదరాబాద్ : నూతన ఆర్వోఆర్ చట్టం-2024ముసాయిదాపై ఈ నెల 4వ తేదీన ఉదయం 10గంటలకు బేగంపేట టూరిజం ప్లాజాలో విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించనున్నట్లుగా తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.లచ్చిరెడ్డి, కె.రామకృష్ణలు తెలిపారు. ప్రజలకు సులభంగా, వేగంగా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసంస్కరణల్లో భాగంగా నూతన ఆర్వోఆర్ చట్టాన్ని తేనుందని, ఇప్పటికే నూతన ఆర్వోఆర్ చట్టం-2024 ముసాయిదా ను సైతం విస్తృత ప్రజాభిప్రాయం కొరకు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన ఆర్వోఆర్ చట్టం-2024 ముసాయిదా పై చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ సదస్సులో ఆర్వోఆర్ ముసాయిదా అందుబాటులో పెడుతున్నామని పేర్కోన్నారు. రైతులకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో, రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంలో మన వంతు పాత్ర పోషించాల్సిన సందర్భం ఏర్పడిందని, డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొని తమ సలహాలు, సూచనలు చేయాలని కోరుతున్నామన్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సుకు ప్రధాన వక్తలుగా భూ చట్టాల నిపుణులు భూమి సునీల్ కుమార్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జీబీరెడ్డి, అనుభవజ్ఞులైన రెవెన్యూ అధికారులు, విశ్రాంత అధికారులు కూడా పాల్గొంటారని వారు వెల్లడించారు.