BANDI SANJAY | చైనా ఆలోచనలను రాహుల్ గాంధీ అమలు చేస్తున్నారు

ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ చైనా ఆలోచనలను అమలు చేస్తున్నారని, చైనా ఆదేశాలతోనే బంగ్లాదేశ్ పరిణామాలపై నోరు విప్పడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు

BANDI SANJAY | చైనా ఆలోచనలను రాహుల్ గాంధీ అమలు చేస్తున్నారు

అంబేద్కర్ ఆలోచనలను రూపుమాపేందుకు కాంగ్రెస్ కుట్ర
కరీంనగర్‌లో హర్ ఘర్ తిరంగా యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్

విధాత, హైదరాబాద్ : ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ చైనా ఆలోచనలను అమలు చేస్తున్నారని, చైనా ఆదేశాలతోనే బంగ్లాదేశ్ పరిణామాలపై నోరు విప్పడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. సోమవారం కరీంనగర్‌లో హర్ ఘర్ తిరంగా యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరై మాట్లాడారు. మువ్వెన్నెల జెండా మనందరి ఆత్మగౌరవ ప్రతీక అని, స్వతంత్ర్య ఫలాలు అందరికీ అందాలన్నదే బీజేపీ లక్ష్యమని, మహనీయుల త్యాగాలను స్మరించుకునేందుకే ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర చేపట్టామని తెలిపారు. నెహ్రూ కుటుంబానికి రాజకీయ లబ్ది కోసం దేశ మహనీయుల త్యాగాలను కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నారని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనను తెరమరుగు చేస్తున్నారని మండిపడ్డారు. స్వతంత్ర్య ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యంతోపాటు మహనీయుల త్యాగాలను స్మరించుకునేందుకు ‘హర్ ఘర్ తిరంగా’ పేరిట కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. నెహ్రూ కుటంబం కోసం కుల, మత, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య గతంలో కాంగ్రెస్‌ చిచ్చు పెట్టిందన్నారు. నెహ్రూ అరాచకాలవల్లే విభజన గాయాలు వెంటాడుతున్నాయని విమర్శించారు. అంబేద్కర్ స్పూర్తితో మోదీ పాలనను కొనసాగిస్తున్నారు. 370 ఆర్టికల్ పేరుతో కాశ్మీర్ దేశంలో అంతర్భాగం కాకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తే… మోదీ 370 ఆర్టికల్ ను రద్దు చేసి కాశ్మీర్ భారత్ లో అంతర్బాగమని నిరూపించిన వ్యక్తి మోదీ అన్నారు. రాహుల్ గాంధీ మాత్రం అంకుల్ శ్యాం పిట్రోడా వాడుతున్న అమెరికా భాషను ఉపయోగిస్తున్నాడని విమర్శించారు. మైనారిటీ సంతూష్టీకరణ విధానాలే దేశ అనిశ్చితికి కారణమని, అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందిస్తే… అందులో కాంగ్రెస్ అనేక పాపాలను జత చేసిందని, కాంగ్రెస్ చేసిన పాపాలను బీజేపీ కడిగే పని చేస్తే తప్పుపడతారా అని ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు బిల్లుకు నెహ్రూ, పీవీ, మన్మోహన్ హయాంలో సవరిస్తే తప్పులేదట గాని, ఆ తప్పులను సరిదిద్దేందుకు మోదీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తెస్తే తప్పుపడతారా? అని నిలదీశారు. మతం పేరుతో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్ర్రెస్ కుట్ర చేస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరేయడం, సెమినార్లు నిర్వహించడం, దేశం కోసం త్యాగం చేసిన మహనీయుల విగ్రహాలను శుద్ధి చేసి పుష్పార్చన చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.. మూడు రంగుల జాతీయ జెండా…మనందరి ఆత్మగౌరవ పతాకం. జెండా, ఎంజెడాలను పక్కనపెట్టి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్లపై మువ్వెన్నల జెండాను ఎగరేయండని, దేశభక్తుల ఫొటోలును పంద్రాగస్టు వరకు వాట్సప్ డీపీలుగా పెట్టుకోండని కోరారు.