రేపు తెలంగాణకు రాహుల్.. రాష్ట్రంలో సుడిగాలి పర్యటన

- బెంగళూరు నుంచి ఖర్గే రాక
- కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఒకే రోజు సుడిగాలి పర్యటన నిర్వహించనున్న రాహుల్.. పలుకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్ గాంధీ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో పినపాకకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పినపాకలో రోడ్ షో కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. తరువాత అక్కడి నుంచి వాయుమార్గంలో నర్సంపేటకు చేరుకోనున్నారు. నర్సంపేటలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఉండనున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా వరంగల్ ఈస్ట్ చేరుకోనున్నారు. అక్కడ సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర చేస్తూ వరంగల్ వెస్ట్ కు వెళ్ళనున్నారు. సాయంత్రం 6:30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ రాజేంద్రనగర్‌కు చేరుకోనున్నారు. అక్కడ సమావేశంలో ముగించుకొని తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళతారు.
బెంగళూరు నుంచి రానున్న ఖర్గే
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి 11 గంటలకు గాంధీ భవన్ వెళ్లి టీపీసీసీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. రాత్రికి హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు. శనివారం ఉదయం 10.30 గంటలకు తిరిగి బెంగుళూరు వెళ్ళనున్నారు.