Kavitha| రైల్ రోకో ట్రైలర్ మాత్రమే: కవిత

- ఆర్టికల్ 243డీ ద్వారా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లకు అవకాశం
- కేబినెట్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి
- సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తక్కువ ఢిల్లీలో ఎక్కువ
- బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వద్ధు
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
విధాత, హైదరాబాద్ : తెలంగాణలో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలన్న డిమాండ్ తో ఈ నెల 17న తెలంగాణ జాగృతి చేపట్టనున్న రైల్ రోకో ట్రైలర్ మాత్రమేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రైల్ రోకో ఒక రోజు మాత్రమే ఉంటుందని..ట్రైలర్ చూపించాలి కాబట్టి ఒకరోజు రైలు రోకో ఉంటుందని..ఓబీసీలకు రిజర్వేషన్ల బిల్లును కేంద్రం అమోదించకపోతే నిరవధిక రైల్ రోకో చేపడతామని తెలిపారు. మంగళవారం కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలంటూ అభ్యర్థించే సమయం అయిపోయిందని..ఇక కొట్లాడే సమయం వచ్చిందన్నారు. ఓబీసీ రిజర్వేషన్ ల కోసం జులై 17న రైల్ రోకో నిర్వహిస్తామని..రిజర్వేషన్ ల బిల్లు ఆమోదం పొందకపోతే రైళ్ళను తిరగనిచ్చేది లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజీ రిజర్వేషన్ల బిల్లును అమలు చేసేందుకు ఆర్టికల్ 243డీ ద్వారా అవకాశముందని..ఈమేరకు రాష్ట్రప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించేలా ఎల్లుండి కేబినెట్ లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దేశంలో అనేక ప్రాంతాలకు వెళ్లి ఓబీసీల గురించి మాట్లాడే రాహుల్ గాంధీ తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు కల్పన పై సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలని కవిత డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబర్ 30కల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావచ్చు అని కవిత అభిప్రాయపడ్డారు. తమిళనాడు మోడల్ లో తెలంగాణలో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలతో హాఫ్ సెంచరీ కొట్టారని..ఆయన రాష్ట్రంలో తక్కువ ఢిల్లీలో ఎక్కువ ఉంటారన్నారు.
కాంగ్రెస్ మోడల్ అవినీతి మోడల్
2011లో యూపీఏ హయంలో జన గణన చేశారు…కానీ ఆ లెక్కలు బయట పెట్టలేదని కవిత విమర్శించారు. . తెలంగాణలో జన గణన సక్రమంగా జరగలేదని…పారదర్శకంగా జరగలేదని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏది సరిగా ఉండదని, ఇది తెలంగాణ మోడల్ కాదు..అవినీతి మోడల్ అని..కాంగ్రెస్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని కవిత విమర్శించారు. ఏదో ఒకటి చెప్పుకోవాలి కాబట్టి కాంగ్రెస్ మోడల్ అంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ తో పాటు బీజేపీ కూడా ఓబీసీలకు అన్యాయం చేస్తుందన్నారు. ఓబీసీ అయిన ప్రధాని మోదీ ఓబీసీల పక్షాన నిలవాలన్నారు. తెలంగాణలో రెండున్నర కోట్ల మంది ఓబీసీలు ఉన్నారని..బీజేపీ గత ఎన్నికల్లో ఓబీసీ సీఎం చేస్తామని హామీ ఇచ్చిందని..బీజేపీ బీసీ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రైల్ రోకో కు ఇంకా ఎవరు మద్దతు ప్రకటించలేదు..రేపు అన్ని పార్టీలకు మద్దతు కోసం లేఖ రాస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరపున పోటీ అవసరం లేదని..అందుకోసం బీఆర్ ఎస్ ఉందన్నారు. బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు నన్ను అడగొద్దని మీడియాను కోరారు. బీఆర్ఎస్ లో పార్టీ పదవులు ఓబీసీలకు ఇస్తారా అన్న ప్రశ్నకు కవిత స్పందిస్తూ..పార్టీలో పదవులు కొందరికే లబ్ది చేకూరుస్తాయని…సమాజంలో రిజర్వేషన్లు వ్యవస్థ మొత్తానికి లాభం చేకూరుతుందంటూ సమాధానమిచ్చారు.