Rain Alert | హైదరాబాద్ : తెలంగాణలో వర్షాలు కురవడం మొదలైంది. నిన్న ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురిసింది. బుధ, గురువారాల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ వానలు దంచికొట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వానలతో పాటు ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షం..
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో 7.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలోని తల్లాడలో 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట 4, దమ్మపేట 3, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 1.7 సెం.మీ వర్షం కురిసింది.
సూర్యాపేట జిల్లాలో భారీ ఉష్ణోగ్రత..
సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 27 జిల్లాలో 40.2-44.7 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
రేపటి లోగా కేరళను తాకనున్న నైరుతి..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు గురువారం కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత వారం రోజులకు రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. తదనంతరం పగటి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదు కానున్నాయి.
