Prakash Goud | నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లోకి .. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్
తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంఅగెస్ పార్టీలో చేరుతున్నానని, సాయంత్రం ఏడు గంటలకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలో చేరనున్నట్లు రాజేంద్రనగర్ బీఆరెస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తెలిపారు

చేరికలు ఒత్తిడితో కాదు..ఇష్టంతోనే సాగుతున్నాయి
హైదరాబాద్ : తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంఅగెస్ పార్టీలో చేరుతున్నానని, సాయంత్రం ఏడు గంటలకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలో చేరనున్నట్లు రాజేంద్రనగర్ బీఆరెస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. “స్వామి దర్శనం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నానని, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. తన నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిపై సీఎంను ఇదివరకే కలిశామని,అధికార పార్టీలో ఉంటే సమస్యల పరిష్కారం అవుతాయన్న ఉద్ధేశంతో కాంగ్రెస్‌లో చేరుతున్నామని ప్రకాశ్‌గౌడ్ స్పష్టం చేశారు. గతంలో బీఆరెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ నాయకత్వంలో కొంత అభివృద్ధి చేసుకున్నామని, ఎవరిపై బురద జల్లేది లేదని స్పష్టం చేశారు. భయభ్రాంతులకు గురి చేసి పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. బెదిరించడానికి తామేమి చిన్నపిల్లలం కాదని, మాపై ఎక్కడ ఒత్తిడి లేదని, మా ఇష్ట ప్రకారమే పార్టీలోకి వెళుతున్నామని అన్నారు. అలాగే రేవంత్ రెడ్డికి కూడా ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదని, ఆయనకు స్పష్టమైన మెజారిటీ ఉందని, కేవలం నియోజకవర్గ సమస్యలను తీర్చుకునేందుకు మాత్రమే నేను కాంగ్రెస్‌లో చేరుబోతున్నానని తెలిపారు. చంద్రబాబును కలిసిన తర్వాత కాంగ్రెస్‌లో చేరికపై నిర్ణయం తీసుకున్నామనేది అవాస్తవమన్నారు. చంద్రబాబు గారు మా రాజకీయ గురువు కావడంతోనే ఆయన్ను కలిశామన్నారు. ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి గురించి చంద్రబాబు నిత్యం పరితపిస్తారని ప్రకాశ్ గౌడ్ చెప్పుకొచ్చారు. తాను కొత్త రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవాలని, తర్వాతే తెలంగాణ రాష్ట్రానికి వస్తానని చంద్రబాబు చెప్పారన్నారు. బీఆరెస్ నుంచి ఇంకా ఎవరెవరు పార్టీ మారుతారనే దానిపై స్పష్టత లేదని, తాను మాత్రం ఒంటరిగానే చేరుతున్నానని తెలిపారు. రేవంత్ రెడ్డి యువకుడు, తెలివైన వాడు, ప్రజా సమస్యలు తెలిసినవాడని, మరో 10 సంవత్సరాలు అధికారంలో ఉంటాడని నమ్మకం ఉందని, దీంతో మరింత అభివృద్ధి చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే వెళుతున్నామన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో మంచి స్వేచ్ఛ ఉంటుందని, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు రేవంత్ రెడ్డి మంచి గౌరవం ఇస్తాదని, రేవంత్ రెడ్డితో మంచి సాన్నిహిత్యం ఉందని, అందరూ బాగుండాలని కోరుకుంటారని ప్రకాశ్ గౌడ్ చెప్పారు.