నీళ్లున్నాయి.. నల్లాలోకి రావడం లేదు

ఈ ఏడాది తీవ్ర వ‌ర్షాభావ ప‌రిస్థితులు ఏర్పడటంతో భూగ‌ర్భ జ‌లాలు అడుగంటాయి. రిజ‌ర్వాయ‌ర్లు నిండ‌లేదు. గ్రామాల‌లో అనేక బోరు బావులు ఎండిపోయాయి

నీళ్లున్నాయి.. నల్లాలోకి రావడం లేదు

  • పైప్‌లైన్లు ఉన్నాయి.. నిర్వహణే కనిపించడం లేదు
  • ప్ర‌ధాన రిజ‌ర్వాయ‌ర్ల‌లో దాదాపు 208 టీఎంసీలు
  • తాగునీటికి ఏటా 86 టీఎంసీలు అవసరం
  • మరో మూడు నెలలకు 20 టీఎంసీలు చాలు

  • విధాత: ఈ ఏడాది తీవ్ర వ‌ర్షాభావ ప‌రిస్థితులు ఏర్పడటంతో భూగ‌ర్భ జ‌లాలు అడుగంటాయి. రిజ‌ర్వాయ‌ర్లు నిండ‌లేదు. గ్రామాల‌లో అనేక బోరు బావులు ఎండిపోయాయి. సాగుకే కాదు… తాగునీటికీ క‌ట‌క‌ట ఏర్ప‌డింది. అనేక గ్రామాల‌లో తాగునీటికి ప్ర‌జ‌లు అల్లాడుతున్నారు. ఈ ప‌రిస్థితికి ప్ర‌ధాన కార‌ణంగా తాగునీటి స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ నిర్వ‌హ‌ణ స‌రిగా లేక పోవ‌డ‌మేన‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. దాదాపు 50 వేల కోట్ల‌తో చేప‌ట్టిన‌ మిష‌న్ భ‌గీర‌థ ప్రాజెక్ట్ కింద 1.30 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల పైప్‌లైన్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ నీరు గ్రామాల్లోని ఆవాసాల‌కు చేర్చ‌డంలో ఏర్పాటు చేసే ప్ర‌ధాన లింక్‌లు స‌రిగ్గా క‌లుప‌క‌ పోవ‌డంతో అనేక గ్రామాల‌కు తాగునీరు స‌రిగ్గా రావ‌డం లేద‌ని తెలుస్తోంది.

    నీళ్లు వ‌చ్చినా పైప్‌లైన్ లింక్‌లు స‌రిగ్గా లేక పోవ‌డంతో నీరంతా లీకై వృథాగా పోతున్న‌ట్లు స‌మాచారం. న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ మండ‌లం సుబ్బారెడ్డి గూడెం గ్రామంలో వ‌ర్షాభావ ప‌రిస్థితుల కార‌ణంగా బావుల‌న్నీ ఎండి పోయాయి. ఈ గ్రామానికి మిష‌న్ భ‌గీర‌థ క‌నెక్ష‌న్లు ఉన్నా 15 రోజుల క్రితం వ‌ర‌కు నీళ్లు రాలేదు. దీంతో గ్రామస్థులు మిష‌న్ భ‌గీర‌థ అధికారుల‌తో మాట్లాడితే నీటి క‌నెక్ష‌న్ ఇచ్చారు .. 15 రోజులుగా మిషన్ భ‌గీర‌థ నీళ్లు వ‌స్తున్నా… పైప్‌లు లీక్ అవుతుండ‌టంతో నీరంతా వృథాగా పోతున్నదని గ్రామ‌స్థులు తెలిపారు. ఇది ఏ ఒక్క గ్రామానికో ప‌రిమితం కాలేదు.. నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ స‌రిగా లేక పోవ‌డంతో అనేక గ్రామాల‌కు స‌రిగ్గా తాగు నీరు వెళ్ల‌డం లేద‌ని తెలిసింది.

    రాష్ట్రంలోని ప్ర‌ధాన రిజ‌ర్వాయ‌ర్ల‌లో దాదాపు 208 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. తెలంగాణ‌లోని అన్ని గ్రామాలు, హైద‌రాబాద్‌తోస‌హా అన్ని ప‌ట్ట‌ణాలకు క‌లిపి ఏడాదికి 86 టీఎంసీల నీరు తాగ‌డానికి అవ‌స‌రం అవుతుందని మిష‌న్ భ‌గీరథ ప్రాజెక్ట్ చేప‌ట్టే నాటికి అంచ‌నా వేశారు. దీని ప్ర‌కారం వేస‌వి కాలం ఏప్రిల్‌, మే, జూన్ నెల‌ల‌కు క‌లిపి 20 టీఎంసీల నీరు స‌రిపోతుంది.ఈ మేర‌కు నీరు కావాల్సినంత అందుబాటులో ఉంది. నీటి ఎద్ద‌డి నివార‌ణ‌కు కేవ‌లం అందుబాటులో ఉన్న పైప్ లైన్ వ్య‌వ‌స్థ‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేయండి, మోట‌ర్ల‌కు రిపేర్లు చేయ‌డంతో, స‌మ‌ర్థ‌వంతంగా నీటి స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ను మానిట‌రింగ్ చేస్తే తాగునీటికి ఢోకా ఉండ‌దు.. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అధికారులు, ప్ర‌భుత్వ యంత్రాంగం ఈ దిశ‌గా క‌స‌ర‌త్తు చేయ‌క‌పోవ‌డంతో రాష్ట్రంలో తాగు నీటి స‌మ‌స్య వ‌చ్చింద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. తాగునీటి స‌మ‌స్య‌పై కాస్త ఆల‌స్యంగా ప్ర‌భుత్వం స్పంధించింద‌న్నచ‌ర్చ కూడా జ‌రుగుతోంది. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం టైమ్ బాండ్‌తో మోటార్ల రిపేర్లు, పైఫ్‌లైన్ల‌కు రిపేర్లు యుద్ధ ప్రాతిప‌దిక‌న చేప‌డితే వేసవి తాగునీటి ఎద్ద‌డిని అథాగ‌మించ వ‌చ్చున‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

    ప్ర‌స్తుతం వివిధ జ‌లాశ‌యాల్లో ఉన్న నీటి నిల్వ‌లు (టీఎంసీల‌లో)

    జూరాల 3.20, శ్రీశైలం 34.29, నాగార్జున సాగర్ 134.92, శ్రీరామ్ సాగర్ 12.64, శ్రీపాద ఎల్లంపల్లి 7.59, కడెం 2.82, మిడ్ మానేర్ 7.59, లోయర్ మానేర్ 5.23.