విధాత : ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా తమ మ్యానిఫెస్టో ఉండబోతున్నదని బీఆరెస్ నేతలు చెబుతూ వచ్చిన విధంగానే బీఆరెస్ తన ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. అయితే.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు పోటీగా బీఆరెస్ ఎన్నికల ప్రణాళిక కనిపిస్తున్నది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు కొంత కొసరు వేసి వడ్డించనున్నట్టు సీఎం కేసీఆర్ చెప్పకనే చెప్పారు. అయితే.. గత రెండు పర్యాయాలు లక్ష చొప్పున వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన బీఆరెస్.. ఈసారి ఆ ప్రస్తావన తేకపోవడం గమనార్హం.
అదే సమయంలో విద్యార్థులు, యువతకు మ్యానిఫెస్టోలో చోటు లభించలేదు. ఉద్యోగాల భర్తీపై ఎలాంటి ప్రకటన లేదు. ఆదివారం పార్టీ అభ్యర్థులు, నేతలతో సమావేశమైన కేసీఆర్.. తొలుత పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బీఫాంలు అందజేశారు. అనంతరం మీడియా సమావేశంలో పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌ను మళ్లీ గెలిపిస్తే ప్రజలందరికీ రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
తెల్లకార్డు కలిగి ఉన్న ప్రతి పేద ఇంటికీ రైతు బీమా తరహాలోనే ఎల్ఐసీ ద్వారా కేసీఆర్ బీమా పేరిట 5 లక్షల ఇన్స్యూరెన్స్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీనికి వంద శాతం ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. తద్వారా పేదలకు ఎనలేని ఎనలేని మేలు చేయడంతోపాటు ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎలీస్ఐసీ బలోపేతానికి దోహదపడతామని చెప్పారు. ఆసరా పెన్షన్లను సైతం భారీగా పెంచుతామని హామీ ఇచ్చారు.
మూడోసారి గెలిచిన తర్వాత ఆసరా పెన్షన్లను ఐదేండ్లలో ఐదు వేల రూపాయలకు తీసుకుపోతామని ప్రకటించారు. ఇప్పుడు ఇస్తున్న 2,016 రూపాయలను సంవత్సరం తర్వాత 3,016కు పెంచుతామని, ఇలా ఐదు వేల వరకూ పెంచుతామని హామీ ఇచ్చారు. దివ్యాంగుకు ఐదేళ్లలో 6,016 రూపాయలకు పెంచుతమని తెలిపారు. రైతుబంధు సాయాన్ని సైతం పెంచుతామని కేసీఆర్ వాగ్దానం చేశారు. ఈ పథకం పెట్టింది తామేనని, పెంచేదీ తామేనని తెలిపారు.
ఇప్పుడు ఏటా ఎకరానికి ఇస్తున్న పదివేలను 12వేలకు పెంచుతామని, వచ్చే ఐదేండ్లలో రైతుబంధు సహాయాన్ని క్రమంగా పెంచుతూ.. గరిష్ఠంగా ఎకరానికి ఏటా 15,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు పాలసీని యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలందరికీ ప్రతినెలా 3,000 రూపాయల జీవన భృతిని అందిస్తామని హామీ ఇచ్చారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యులు భరించలేని స్థాయిలో గ్యాస్ ధర పెంచిందన్న కేసీఆర్.. తమను గెలిపిస్తే పేద మహిళలకు గ్యాస్ బండను 400కే అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే.. అక్రడిటేషన్ కార్డు ఉన్న పాత్రికేయులకు కూడా రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు. కేంద్రం దాని రేటు ఎంత పెంచినా.. మిగిలిన మొత్తాన్ని తమ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిమితిని గరిష్ఠంగా 15 లక్షలకు పెంచుతామని కేసీఆర్ చెప్పారు. అర్హులైన పేద మహిళలకు నెలకు మూడు వేలు భృతిగా అందిస్తామని హామీ ఇచ్చారు.
పేదలకు ఇండ్ల స్థలాలు
రాష్ట్రంలో ఇంటి జాగ లేని నిరుపేదలకు బీఆరెస్ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు సమకూరుస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమలవుతున్న హౌసింగ్ పాలసీ చక్కగా ఉన్నదని, దానికి అలానే కొనసాగిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని రెసిడెన్షియల్ విద్యాలయాలను ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్.. ఈసారి అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సమాఖ్యలన్నింటికీ సొంత భవనాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు తమకు పూర్వమున్న పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని కోరుతున్నారన్న సీఎం.. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీని నియమించి.. దాని నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనాథలైన పిల్లల కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని చెప్పారు. అసైన్డ్ భూములను చెర నుంచి విడిపిస్తామని హామీ ఇచ్చారు.
మైనార్టీ సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని వాగ్దానం చేశారు.
సంపదను ప్రజలకు పెంచాం
గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ సంపదను ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే బడ్జెట్‌ను దాదాపు 3 లక్షల కోట్లకు తీసుకపోయామని చెప్పారు. ఎస్టీ రెండున్నర రెట్లు పెంచామని, తలసరి ఆదాయం పెరిగిందని అన్నారు. సంక్షేమానికి – అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇచ్చామని, సంక్షేమంలోనూ, క్యాపిటల్ వ్యయంలోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ చెప్పారు.
దేశంలో ఉత్తమమైన ఆర్థిక పాలసీ తెలంగాణదేనని చెప్పారు. బెస్ట్ పవర్ పాలసీ, బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ, బెస్ట్ ఇరిగేషన్ పాలసీ, బెస్ట్ అగ్రికల్చర్ పాలసీ, బెస్ట్ దళిత్ పాలసీ, బెస్ట్ వెల్ఫేర్ పాలసీ, బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ, బెస్ట్ హెల్త్ పాలసీ, టెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ, బెస్ట్ హౌసింగ్ పాలసీ తదితరాలన్నీ విజయవంతంగా అమలవుతున్నాయని, వీటిని యథాతథంగా కొనసాగిస్తామని చెప్పారు. కాలానుగుణంగా ఉద్దీపనలిస్తూ, ఉన్నతీకరించుకుంటామని తెలిపారు.