Revanth Reddy | సమగ్ర సర్వేపై రేవంత్ రెడ్డి పాత వీడియో వైరల్.. సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు..
Revanth Reddy | సమగ్ర సర్వేపై రేవంత్ రెడ్డి పాత వీడియో వైరల్.. సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు..కనీస పరిజ్ఞానం, జ్ఞానం ఉన్నోడు ఎవడైనా చేసే పనేనా..? ఇట్లాంటి వివరాలు సేకరించమంటడ. ఏదో ఎగిరి దుంకి చేస్తున్న అన్నట్టు మాటలు మాట్లాడుతున్నడు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Revanth Reddy | రాజకీయాలకు విలువలు లేకుండా పోయాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారపక్షంపై, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంపై విమర్శలు చేయడం రాజకీయంగా పరిపాటి అయిపోయింది. ఏం మాట్లాడుతున్నామో తెలియకుండానే నోటికొచ్చినట్లు మాట్లాడి రాజకీయ విలువలకు పాతరేస్తున్నారు. కనీస పరిజ్ఞానం లేకుండా.. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు అడ్డగోలుగా మాట్లాడి రాజకీయ హీరోలు కావాలనుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో తాము మాట్లాడిన మాటలు మళ్లీ తమకే తగులుతాయి. అది అధికారపక్షానికి కావొచ్చు.. ప్రతిపక్షానికి కావొచ్చు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఓ ఆయుధం దొరికింది. అదేంటంటే.. నాటి సీఎం కేసీఆర్ చేపట్టిన సమగ్ర సర్వేపై టీడీపీ నాయకుడిగా నాడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఇప్పుడు ఆ వీడియోను బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు.
అసలు ఆ వీడియోలో రేవంత్ ఏమన్నారంటే..?
ఇవాళ అడ్డమైనోని మన ఇంటికి పంపించి మన ఆస్తులు, మన ఖాతాలు, మన వివరాలన్నీ అడ్డమైనోని చేతిల పెట్టమంటడ. ఎవడన్న బుద్ధి ఉండేటోడు చేసే పనేనా..? మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్న మంది వివరాలు ఎటు పోయిన పర్వా లేదు అనుకుంటుండ ఈ ముఖ్యమంత్రి గారూ. కనీస పరిజ్ఞానం, జ్ఞానం ఉన్నోడు ఎవడైనా చేసే పనేనా..? ఇట్లాంటి వివరాలు సేకరించమంటడ. ఏదో ఎగిరి దుంకి చేస్తున్న అన్నట్టు మాటలు మాట్లాడుతున్నడు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే (కుల గణన/ రాజకీయ గణన) గురించి@revanth_anumula గారి మాటల్లో 👇
ఇప్పుడు అడ్డమైనోళ్లని ఇళ్లకి పంపేది ఎవరు? వాళ్ళని ఏమనాలి❓ pic.twitter.com/iXhHCOBZoa
— YSR (@ysathishreddy) November 8, 2024
మరి ఇవాళ ఇప్పుడు అడ్డమైనోళ్లని ఇళ్లకి పంపేది ఎవరు? వాళ్ళని ఏమనాలి అని రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. అంతేకాదు తీవ్ర విమర్శలు చేస్తూ రేవంత్‌ను బనాయిస్తున్నారు. కుటుంబసభ్యుల పేర్లు, మతం, కులం, వయసు, మాతృభాష, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, ఆదాయం, ఇల్లు, భూములు, రిజర్వేషన్ ప్రయోజనాలు, విద్య, ఉద్యోగం, వృత్తి, వలసలు, ఐదేళ్ల నుంచి తీసుకున్న బ్యాంకు లోన్ల గురించి పూర్తి సమాచారం అడగడం ఎంత వరకు సమంజసం అని బీఆర్ఎస్ నేతలు, పలువురు నెటిజన్లు రేవంత్ సర్కార్‌ను నిలదీస్తున్నారు.