ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి రేవంత్ సర్కార్ షాక్
మద్యం దుకాణాల నిర్వహణకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో సొంత నిబంధనలు పెట్టగా, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ, రాష్ట్రంలో ఒకే ఎక్సైజ్ పాలసీ ఉంటుందని స్పష్టం చేశారు.

విధాత : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. మద్యం దుకాణాల నిర్వహణలో తన నియోజకవర్గంలో తను చెప్పిన నిబంధనలు పాటించిన వారే టెండర్లకు ముందుకెళ్లాలని ఇటీవల రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేశారు. సాయంత్రం 4నుంచి రాత్రి 9వరకే మద్యం దుకాణాలు తెరవాలని..పర్మిట్ రూమ్‌లు పెట్టొద్దని రాజగోపాల్ రెడ్డి ఆంక్షలు పెట్టారు. దీంతో నియోజకవర్గం పరిధిలో మద్యం దుకాణాల కోసం చాలమంది టెండర్లు వేయడానికి భయపడ్డారు. ఈ సమస్యపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వద్దకు వెళ్లి వివరించారు. ప్రభుత్వం నిబంధనలకు భిన్నంగా స్థానిక ఎమ్మెల్యే వైన్స్ ల నిర్వహణకు కొత్త రూల్స్ పెట్టారని..ఇలాగైతే తాము టెండర్లు వేసేదెట్లా అంటూ తమ సమస్యను విన్నవించారు.
దీనిపై స్పందించిన మంత్రి జూపల్లి రాష్ట్రం మొత్తం ఎక్సైజ్ పాలసీ ఒకటే ఉంటుందని, ఎవరిష్టం వచ్చినట్లు వారు సొంత పాలసీలు పెడితే నడవవు కదా అని..అనవసరంగా భయపడకుండా అంతా టెండర్లు వేసుకోవచ్చని స్పష్టం చేశారు. డ్రాలో షాపులు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని భరోసా ఇచ్చారని సమాచారం. మరోవైపు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా చేసిన వ్యాఖ్యలు…మంత్రి పదవి రాలేదన్న కోపంతో ఆయన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల తరుచూ చేస్తున్న కామెంట్లపై ఢిల్లీ హైకమాండ్ కు ఓ నివేదిక అందించారని పార్టీ వర్గాలలో చర్చ సాగుతుంది.