Vemula Prashanth Reddy | రేవంత్‌రెడ్డిది ప్రజా పాలన కాదు..నియంతృత్వ పాలన : మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదని, నియంతృత్వ పాలన అని, అసెంబ్లీని కౌరవ సభలా ఇష్టారాజ్యంగా నడిపించారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఏడు నెలల్లోనే రేవంత్ రెడ్డి వికృతరూపం బయటపడిందని విమర్శించారు

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదని, నియంతృత్వ పాలన అని, అసెంబ్లీని కౌరవ సభలా ఇష్టారాజ్యంగా నడిపించారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఏడు నెలల్లోనే రేవంత్ రెడ్డి వికృతరూపం బయటపడిందని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో బీఆరెస్ గొంతు నొక్కారని, జీరో అవర్ మొత్తం ఎత్తివేశారని, ప్రశ్నోత్తరాలు లేకుండా చేశారని విమర్శించారు. సభలో చర్చలకు, ప్రజా సమస్యలపై మాట్లాడితే మైకులు కట్టేశారని.. ఇదేంటని అడిగితే మార్షల్స్‌తో బయటకు తరలించారని మండిపడ్డారు. రేవంత్ సభా నాయకుడిగా కాకుండా అటవిక రాజులా వ్యవహరించారన్నారు. సీఎం ఇష్టారాజ్యంగా సభను తప్పుడు దోవ పట్టించారని విమర్శించారు. ఏ చర్చపై కూడా పూర్తిగా మాట్లాడనివ్వలేదని, కేసీఆర్‌ను తిట్టుడు.. గత ప్రభుత్వంపై ఆరోపణలతోనే సభ నడించిందని అన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షమని చెబుతున్న ఎంఐఎం కూడా కాంగ్రెస్ తీరును తప్పుబట్టిందని తెలిపారు.కాంగ్రెస్ హామీలను అమలు చేయడమే లక్ష్యంగా తాము మాట్లాడామని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలు, 420 హామీల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలైనా వంద రోజుల్లో అమలుచేస్తామన్న హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పారని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు నియామక పత్రాలిచ్చి తాము 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విద్యుత్తు్ ఒప్పందంలో వ్యవసాయ మోటార్లకు మినహాయింపు ఉన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తొక్కిపెట్టి తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాల్లో రేవంత్ రెడ్డికి గిన్నిస్ బుక్ రికార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
దమ్ముంటే దానం రాజీనామా చేసి గెలవాలి
శాసన సభలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ముఖ్యమంత్రి మైక్ ఇప్పించి తమను తిట్టించారని బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో దానం నాగేందర్ సంస్కారం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. నిరుద్యోగుల కోసం తాము కొట్లాడుతుంటే.. దానం నీచమైన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దానం బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున తిరుగుతున్నా.. ఎక్కడికి రమ్మంటావో చెప్పు అంటూ సవాలు విసిరారు. లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి ఉప్పల్‌లో ఉరికించింది మరిచిపోయావా అని ప్రశ్నించారు. దానం నాగేందర్ రెడ్డికి ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని కౌశిక్ రెడ్డి తెలిపారు. దానం నాగేందర్‌కు దమ్ముంటే.. సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని డిమాండ్ చేశారు. తేదీలు, ఉద్యోగ ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం సిగ్గులేకుండా బోగస్ జాబ్ క్యాలెండర్‌తో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.