MLC Jeevan Reddy | రెవెన్యూ వ్యవస్థ ప్రభుత్వానికి కళ్ళు, చెవులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
వెన్యూ వ్యవస్థ ప్రభుత్వానికి కళ్ళు, చెవులు వంటిదని, ప్రభుత్వమంటేనే రెవెన్యూ వ్యవస్థ అని.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ద్వారా రైతులు ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు.

నూతన ఆర్ఓఆర్ చట్టంపై ట్రెసా రాష్ట్రస్థాయి చర్చావేదిక
విలువైన సూచనలిచ్చిన వక్తలు
విధాత, హైదరాబాద్ : రెవెన్యూ వ్యవస్థ ప్రభుత్వానికి కళ్ళు, చెవులు వంటిదని, ప్రభుత్వమంటేనే రెవెన్యూ వ్యవస్థ అని.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ద్వారా రైతులు ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన నూతన ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని తెలియజేశారు. కొత్త రెవెన్యూ చట్టం ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపే విధంగా ఉండాలన్నారు. గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను కుట్రపూరితంగా తొలగించి అటు ప్రజలకు ఇటు ఉద్యోగులకు బీఆరెస్ ప్రభుత్వం తీవ్రంగా నష్టం చేసిందని దీనిపై ఈ ప్రభుత్వం అన్ని వర్గాలతో చర్చించి గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరిచి ఒక మంచి చట్టం ద్వారా తెలంగాణ ప్రజలకు నాణ్యమైన మరియు మేలైన సేవలు అందిస్తామని తెలియజేశారు. ట్రెసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంత మంచి కార్యక్రమాన్ని అభినందిస్తూ వారందించే సూచనలు అన్నింటిని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దృష్టికి, రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి అవన్నీ చట్టంలో పొందుపరిచేలా తాను ప్రయత్నిస్తానని తెలియజేశారు. రెవెన్యూ చట్టం ముసాయిదాపై ప్రజాభిప్రాయాన్ని కోరడమే ప్రజలపట్ల మా ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనమన్నారు. ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త చట్టం చేసే ముందు వివిధ వర్గాల నుండి సూచనలను తీసుకోవడం శుభ పరిణామమన్నారు. అదే విధంగా నూతన చట్టం అమలుకు సంబంధించి అసోసియేషన్ ద్వారా తగిన సూచనలు చేయడం జరుగుతుందని వీటి ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందించడానికి రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగులందరూ ముందుంటారన్నారు. కొత్త చట్టంలో ఆర్డివోకు అప్పీలేట్ అథారిటీ, అదనపు కలెక్టర్ రెవెన్యూ స్థాయిలో రివిజన్ అథారిటీ ఉండాలని,అలాగే ఇతర శాఖలకు బదలాయించిన వీఆర్వోలను, వీఆర్ఏలను తిరిగి రెవెన్యూలోకి తీసుకొని గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్ట పరచాలని ప్రభుత్వాన్ని కోరారు.
విలువైన సూచనలిచ్చిన వక్తలు
ఈ చర్చా వేదికలో మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కె.నరేందర్ రెడ్డి, ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, వీఆర్వోల సంఘం అధ్యక్షులు గోల్కొండ సతీష్, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు గౌరిశెట్టి మనోహర్, గంప శంకరయ్య, చంద్రయ్య, ప్రభాకర్, సుదర్శన చారి, ఈశ్వర్‌లు మాట్లాడుతూ కొత్త రెవెన్యూ చట్టంలో పలు విలువైన సూచనలు అందించారు. క్రెడాయ్ ప్రతినిధి అనిల్, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన చంద్రమౌళి, న్యాయవాదులు కొరివి వేణుగోపాల్, ఎర్రం రాజి రెడ్డి, సొల్లు సత్యం, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన్ ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లును స్వాగతిస్తూ పలు సూచనలు చేశారు. వక్తలు ప్రధానంగా భూధార్ ఇచ్చే ముందే సరైన సర్వే నిర్వహించాలని, నామమాత్రంగా నైనా భూమిశిస్తూ ఉండాలని, సాదాబైనామాల విషయంలో నియంత్రణ ఉండాలని, మ్యూటేషన్, సక్సేషన్ మొదలైన సర్వీసులు మండల స్థాయిలోనే రైతులకు అందుబాటులో ఉండాలని అవి ఇచ్చే ముందు ప్రతి సర్వే సబ్ డివిజన్ రికార్డ్ తయారు చేసి వాటికి భూదార్ నెంబర్ కేటాయించాలని ముఖ్యంగా గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్ట పరచాలని జిల్లా స్థాయిలోనే రైతులకు అన్ని రకాల రెవెన్యూ సర్వీసులు అందించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డిఓ మహేశ్వర్, మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, ట్రెసా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పడిగెల రాజ్ కుమార్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయ్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ట్రెసా రాష్ట్ర కమిటీ సభ్యులు రియాజ్, నిరంజన్, చైతన్య వివిధ జిల్లా కమిటీల అధ్యక్షులు రమన్ రెడ్డి, వకీల్, కిషన్, శ్రీనివాస్, రాజ్‌ప్రకాష్, వీఆర్ఏ జేఏసీ నాయకులు దాదేమియా, వెంకటేష్, మాధవ్,వివిధ జిల్లాల నుండి తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దారులు,గిర్దావర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.