రైతులు వానాకాలం పంట సీజన్ లో కేఎన్ఎం 12510 రకం ధాన్యం పండించవద్దని, ఆ ధాన్యాన్ని మేం కొనుగోలు చేయమని మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ముందస్తు ప్రకటనలో పేర్కొంది. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ లు మీడియా సమావేశంలో రైతులకు కేఎన్ఎం రకం ధాన్యం సాగు చేయవద్దంటూ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎంపిక చేసిన ఎనిమిది రకాల విత్తనాలలో ఇది లేనందున రైతులు సాగు చేయవద్దని వారు పేర్కొన్నారు.
జనం ఈ బియ్యాన్ని కొనడం లేదు…
గత ఖరీఫ్ లో దిగుబడి ఎక్కువగా వస్తుందని కేఎన్ఎం 12510సాగు చేశారని, అయితే మిల్లింగ్ తర్వాత ఆ బియ్యం అమ్ముడు పోవడం లేదన్నారు. అన్నం మెత్తగా ముద్దగా కావడం, త్వరగా పాడైపోవడంతో కేఎన్ఎం 12510బియ్యం ఎవరూ కొనడం లేదని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తెలిపింది. అందుకే కేఎన్ఎం ధాన్యాన్ని మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ ఎవరు కొనకూడదని నిర్ణయించుకున్నామని, ఈ విషయాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు గుర్తించాలని కోరారు. వినియోగదారుడి కోరుకునే ధాన్యం రకాలనే రైతుల పండిస్తే కొనుగోలు, అమ్మకాలలో రైతులకు, మిల్లర్లకు ఇబ్బంది ఉండబోదన్నారు. కేఎన్ఎం 12510రకం ధాన్యం హెచ్ఎంటీ, జై శ్రీరామ్, చింటూ రకం ధాన్యం అంత నాణ్యత లేకపోవడంతో బియ్యం అమ్ముడు పోక రైస్ మిల్లర్లు నష్టపోతున్నారని తెలిపారు.
ముందే చెబుతున్నాం…
రైతులను అప్రమత్తం చేసేందుకు కేఎన్ఎం 12510 రకం ధాన్యం సాగు చేయకూడదని వాన కాలం సీజన్ కు ముందే చెబుతున్నామని మిల్లర్లు పేర్కొన్నారు. రైతులు కేఎన్ఎం రకం ధాన్యం సాగుచేయకుండా మాకు సహకరించాలని, దీనిపై జిల్లా కలెక్టర్లకు, అధికార యంత్రాంగానికి కూడా సమాచారం అందిస్తామని తెలిపారు. మేం మాత్రం కేఎన్ఎఎం 12510రకం ధాన్యం కొనుగోలు చేయబోమని, కాదని రైతులు పండిస్తే ప్రభుత్వ కొంటుందా? లేక ప్రైవేట్ గా అమ్ముకుంటారా? అన్నది రైతులు, ప్రభుత్వ పరిధిలోని అంశం అని స్పష్టం చేశారు.
ఈ సమావేశం లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మిర్యాలగూడ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి, కార్యదర్శి పోలిశెట్టి ధనుంజయ, కోశాధికారి గందె రాము, మిల్లర్లు బండారు కుశలయ్య, రేపాల అంతయ్య, మోహన్ రావు, గుడుగుంట్ల గణేశ్, గార్లపాటి మధులు పాల్గొన్నారు.
33 రకాల సన్నలకు ప్రభుత్వం రూ. 500బోనస్
ధాన్యం విత్తనాల్లో ప్రస్తుతం మార్కెట్లో వందల రకాల సన్న రకాల విత్తనాలు ఉన్నాయి. ఇందులో వ్యవసాయ యూనివర్సిటీ విడుదల చేసిన రకాలతో పాటు ప్రైవేటు కంపెనీలు విడుదల చేసిన రకాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఒక్కో జిల్లాకు ఒక్కో వెరైటీ విత్తనాలను రైతులు సాగు చేస్తారు. ఎన్నికల హామీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్వింటాలు సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ ప్రకటించింది. మొత్తం 33 సన్న రకాల వరి వంగడాలను బోనస్ తో కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన లిస్ట్‌ను విడుదల చేసింది.
బోనస్ తో ప్రభుత్వం కొనుగోలు చేయనున్న వరి వంగడాలు
సిద్ది (డబ్ల్యూజీఎల్ 44)
కంపసాగర్ వరి-1 (కేపీఎస్ 2874)
సాంబ మసూరి (బీపీటీ-5204)
జగిత్యాల వరి-3 (జేజీఎల్ 27356)
జగిత్యాల వరి-2 (జేజీఎల్ 28545)
వరంగల్ సాంబ (డబ్ల్యూజీఎల్ 14)
వరంగల్ సన్నాలు (డబ్ల్యూజీఎల్ 32100)
జగిత్యాల మసూరి (జేజీఎల్ 11470)
పొలాస ప్రభ (జేజీఎల్ 384)
క్రిష్ణ (ఆర్ఎన్ఆర్ 2458)
మానేరు సోనా (జేజీఎల్ 3828)
తెలంగాణ సోనా (ఆర్ఆఎన్ఆర్ 15048)
వరంగల్ వరి- 1119
కూనారం వరి-02 (కేఎన్ఎం 1638)
వరంగల్ వరి-02 (డబ్ల్యుజీఎల్ 962)
రాజేంద్రనగర్ వరి-4 (ఆర్ఎన్ఆర్ 21278)
కూనారం వరి-1 (కేఎన్ఎం 733)
జగిత్యాల సన్నాలు (జేజీఎల్ 1798)
జగిత్యాల సాంబ (జేజీఎల్ 3844)
కరీంనగర్ సాంబ (జేజీఎల్ 3855)
అంజన (జేజీఎల్ 11118)
నెల్లూరు మసూరి (ఎన్ఎల్ఆర్ 34449)
ప్రత్యుమ్న (జేజీఎల్ 17004)
సుగంధ సాంబ (ఆర్ఎన్ఆర్ 2465)
శోభిని (ఆర్ఎన్ఆర్ 2354)
సోమ్నాథ్ (డబ్ల్యుజీఎల్ 347)
ఆర్ఎన్ఆర్ 31479 (పీఆర్ సీ)
కేపీఎస్ 6251 (పీఆర్సీ)
జేజీఎల్ 33124 (పీఆర్ సీ)
హెచ్ఎంటీ సోనా
మారుతీరు సాంబ (ఎంటీయు 1224)
మారుతీరు మసూరి (ఎంటీయు 1262)
ఎంటీయు 1271
