Kavitha : ఫోన్ ట్యాపింగ్ అంతా వాళ్లే చేయించారు
బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వెనుక హరీష్ రావు, సంతోష్ రావులే ఉన్నారని కవిత ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంలో నలుగురికి నోటీసులొచ్చాయని ఆమె తెలిపారు.

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలో ఫోన్ ట్యాపింగ్ అంతా హరీష్ రావు, సంతోష్ రావు, శ్రవణ్ రావులే చేయించారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. చిట్ చాట్ లో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ కేసు నోటీసులు వచ్చాయన్నారు. కేటీఆర్ కు సంబంధించిన వారి ఫోన్లను కూడా వారే ట్యాపింగ్ చేయించారని కవిత ఆరోపించారు. నా భవిష్యత్తు రాజకీయ కార్యక్రమాలన్ని కేసీఆర్ ఫోటోతోనే కొనసాగిస్తానని కవిత ప్రకటించారు. నేను కేసీఆర్ కు రాసిన లేఖను సంతోష్ రావు లీక్ చేయించారని కవిత వెల్లడించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగే ప్రతి విషయం కాంగ్రెస్ నేతలకు తెలుస్తుందని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ అధినేత కేసీఆర్ కు వాళ్ళ అవినీతి గురించి చెప్పానని కవిత తెలిపారు. ఇప్పటివరకు హరీష్ రావు సంతోష్ రావు గ్యాంగ్ లతో అంతర్గతంగా పోరాడానని.. ఇప్పుడు స్వేచ్ఛగా బయటికి వచ్చి పోరాడుతానని తెలిపారు. తన దగ్గర చాలా సమాచారం ఉందని ఒక్కొక్కటిగా అన్ని బయటపెడతానని కవిత వెల్లడించారు. ప్రస్తుతం తన దగ్గర ఉన్న సమాచారం బయటపడితే బీఆర్ఎస్ నేతలు అంతా ఇబ్బంది పడతారు అన్నారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అవినీతిపై తనకు పల్లా రాజేశ్వర్ రెడ్డి సమాచారం ఇచ్చారని.. జనగామ టికెట్ పై ఇద్దరూ గొడవ పడ్డారని గుర్తు చేశారు.