RS Praveen Kumar | ఖైదీల తిండి కోసం 83 రూపాయలు.. కానీ విద్యార్థుల తిండి కోసం 37 రూపాయలే ఖర్చు : బీఆరెస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

రాష్ట్రంలో ప్రజా పాలనకు బదులు ప్రతీకార పాలన సాగుతున్నదని బీఆరెస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

RS Praveen Kumar | ఖైదీల తిండి కోసం 83 రూపాయలు.. కానీ విద్యార్థుల తిండి కోసం 37 రూపాయలే ఖర్చు : బీఆరెస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

RS Praveen Kumar | రాష్ట్రంలో ప్రజా పాలన (Praja Palana)కు బదులు ప్రతీకార పాలన సాగుతున్నదని బీఆరెస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో తొమ్మిది నెలలుగా విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేడని అన్నారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి ఎన్నడైనా సమీక్షించారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నదని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు యూనిఫామ్స్‌ లేవని, చలికాలం వస్తున్నా ఇప్పటికీ రగ్గులు, బూట్లు ఇవ్వలేదని తెలిపారు. ఫీజులు కట్టడం లేదని కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు మెమోలు ఇవ్వడం లేదని చెప్పారు. ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్‌ (Fee Reimbursement ) బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

గత కేసీఆర్‌ (KCR) ప్రభుత్వం గురుకులాల్లో పేద విద్యార్థులు ఎంబీబీఎస్‌, ఐఐటీలు సాధించాలని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటు చేస్తే.. ఇపుడు వాటిని ఎత్తి వేసే కుట్ర జరుగుతోందన్నారు. నాలుగు నెలలుగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ గెస్ట్‌ ఫ్యాకల్టీకి జీతాలు ఇవ్వడం లేదన ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. వాళ్లంతట వాళ్లే ఉద్యోగాలు మానేసేలా ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. పేద విద్యార్థులంటే ఎందుకు కోపం రేవంత్ రెడ్డీ (CM Revanth Reddy) అని నిలదీశారు. విద్యా భరోసా కింద ఒక్కో విద్యార్థికి 5 లక్షలు ఇస్తామన్నారని, ఇప్పటి వరకూ ఒక్క పైసా అయినా విడుదల చేశారా? అని ప్రశ్నించారు.

దేశానికే రోల్‌ మోడల్‌గా గురుకులాలను కేసీఆర్‌ తీర్చిదిద్దితే.. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని విస్మరిస్తోందని ప్రవీణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాల్లో అన్ని వర్గాల విద్యార్థులు విద్యను పొందుతున్నారని, అక్షయ పాత్ర (Akshaya Patra) సంస్థలను విద్యాలయాలకు అంటగట్టడం సరికాదన్నారు. ధార్మిక సంస్థల భోజన విధానాన్ని గురుకులాల్లో అమలు చేయవద్దని కోరారు. బ్రహ్మ కుమారీస్‌, అక్షయ పాత్ర సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు మానుకోవాలని డిమాండ్‌ చేశారు. పేద విద్యార్థుల మీద ప్రయోగాలు చేయొద్దని, ధార్మిక సంస్థల ఆలోచనలను విద్యార్థులపై బలవంతంగా రుద్దవద్దని అన్నారు.

ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జైళ్లలోని ఖైదీల తిండికి తలా 83 రూపాయలు చొప్పున ఖర్చు చేస్తున్నది కానీ.. విద్యార్థుల తిండి కోసం 37 రూపాయలే ఖర్చు చేస్తున్నదని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. అన్నమో రామచంద్రా అంటూ సగం పొట్టతో గురుకులాల్లో విద్యార్తులు పస్తులుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల విద్యార్థుల మెస్‌ చార్జీలను ప్రభుత్వం వెంటనే పెంచాలని డిమాండ్‌ చేశారు.

పర్యావరణాన్ని కాపాడుకోవాలి కానీ పేదలకు ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయం ఉండకూడదని ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. పేదలపై వెంటనే యాక్షన్ తీసుకుంటున్న హైడ్రా.. దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించారు. ‘మహబూబ్ నగర్ లో అంధుల కాలనీలో అధికారులు ఇళ్ళు కూలుస్తున్నపుడు శిథిలాల్లో యూనిఫామ్ వేసుకున్న అమ్మాయి తన బుక్స్ వెతుక్కుంటోంది.. ఈ దృశ్యం చూసి నాకు ఏడుపు వచ్చింది. సీఎంకి ఎలా నిద్రపడుతోంది?’ అని ప్రశ్నించారు.