Fake ACB Officers Cheat RTA official : ఏసీబీ అధికారులమంటూ 10 లక్షలు వసూలు
తాము ఏసీబీ అధికారులమంటూ వరంగల్‌కు చెందిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) జైపాల్ రెడ్డిని కొందరు వ్యక్తులు బెదిరించి, దశలవారీగా రూ. 10.20 లక్షలు వసూలు చేశారు. మోసపోయానని గ్రహించిన ఎంవీఐ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఘటన కలకలం రేపింది.

విధాత, వరంగల్ ప్రతినిధి: ఏసీబీ అధికారులమంటూ వరంగల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు రూ. 10 లక్షల 20 వేల రూపాయలు టోకరా వేసిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తాము ఏసీబీ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ బెదిరించడంతో ఆ అధికారి భయపడి దశలవారీగా డబ్బులు దుండగుని అకౌంట్ కు పంపించారు. తర్వాత తాము మోసపోయానని గమనించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జైపాల్ రెడ్డి స్థానిక మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి ముందు ఏసీబీ అధికారి సాంబయ్యకు ఫోన్ చేసి తమను కొందరు వ్యక్తులు బెదిరించారని వివరించడంతో ఈ సంఘటనతో ఏసీబీకి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఆర్టీవో అధికారి పోలీసులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆర్టిఏ శాఖలో జరుగుతున్న అవినీతి దీనికి మూల కారణమని చర్చ సాగుతుంది.