Food Safety | హోటళ్ల పాలిటి సింహస్వప్నం – ఆర్వీ కర్ణన్ IAS
ఆర్వి కర్ణన్ ఐఏఎస్, తెలంగాణలో బాగా నానుతున్న రెండు ఐఎఎస్ అధికారుల పేర్లలో ఒకటి. తెలంగాణ ఆహార భద్రతా కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ డైరెక్టర్‌గా కర్ణన్ ఇప్పుడు హైదరాబాద్‌లోని హోటళ్లకు, రెస్టారెంట్లకు, టేకవేలకు, స్ట్రీట్ పుడ్స్‌కు దడ పుట్టిస్తున్నారు. ఎప్పుడు, ఏ హోటళ్లో ప్రత్యక్షమవుతాడో ఎవరికీ తెలియదు. ఆయన సిబ్బందికి కూడా.

ఆర్వీ కర్ణన్(RV Karnan IAS) తెలంగాణ క్యాడర్ 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2007లోనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ టాపర్. కానీ మళ్లీ ప్రయత్నించి 2012లో 158వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా నిలిచాడు. తమిళనాడుకు చెందిన ఆర్ వీర రాఘవన్ కర్ణన్ శివగంగ జిల్లా, కరైకుడిలో జన్మించాడు. తండ్రి వీర రాఘవన్ ఒక లైబ్రేరియన్. తల్లి విజయలక్ష్మి సబ్ రిజిస్ట్రార్. సతీమణి ప్రియాంక చెక్కా ఐఏఎస్(Priyaka Chekka IAS), సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్. మొట్టమొదటగా ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన కర్ణన్ చాలా ముక్కుసూటి మనిషి. ఎవరికీ బెదరని తత్వం. తరువాత మంచిర్యాల, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ జిల్లాల కలెక్టర్‌గా పనిచేసాడు.
తన విలక్షణమైన పనితీరుతో ఆయా జిల్లాల ప్రజల్లో మంచి పేరు సంపాదించాడు. ఈ మధ్య జరిగిన ఐఏఎస్‌ల బదిలీలలో తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్(Health and Family Welfare Commissioner)గా నియమితుడయ్యాడు. ఆహార భద్రత, నాణ్యతా పర్యవేక్షణ(Food Safety) ఈ విభాగం కిందకే వస్తుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Health Minister Damodara Raja Narsimha)కు చాలా ఇష్టమైన ఆఫీసర్. ఇంకేం, కావాల్సినంత ఫ్రీహ్యాండ్. వెనక్కిచూడాల్సిన అవసరమే లేదు.
ఏప్రిల్ 16న ఆరోగ్య శాఖకు వచ్చినప్పటి నుండీ, హోటళ్లు, రెస్టారెంట్లు.. ఒకటేమిటి? తిండి అమ్మే ప్రతీవాడి మీదకు వెళ్లిపోయాడు. ఎవరైనా సరే, ఎంత పెద్ద రెస్టారెంటయినా పర్లేదు. అదే దూకుడు. Continuous checks on Hotels. ఆ సింహానికి బలైన రెస్టారెంట్లలో హైదరాబాద్‌లో బాగా పాపులరయిన, ప్యారడైజ్(Hotel Paradise), బావార్చి(Bawarchi), కేఫె బహార్, షా గౌస్, రామేశ్వరం కేఫ్, బాహుబలి కిచెన్, పిస్తా హౌజ్(Pista House), బాస్కిన్–రాబిన్స్ లాంటివి కూడా ఉన్నాయి. వచ్చిన 70 రోజులలో 129 రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్‌లు తనిఖీ చేసి 90 షోకాజ్ నోటీసులు జారీ చేసాడు.
హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్. బిర్యానీ (Hyderabad Biryani)నాణ్యత విషయంలో రెస్టారెంట్లు ఓ జిమ్మిక్కు ప్లే చేస్తాయి. రెస్టారెంట్‌కు వచ్చి బిర్యానీ తినేవారికి మంచి క్వాలిటీ ఫుడ్డే పెడతారు. కానీ, స్విగ్గీ, జొమాటోల(Swiggy, Zomato) ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేసేవారికి మాత్రం విపరీతమైన మసాలా ముద్దలు, చిన్నచిన్న ముక్కలు, మిగిలిన రైస్.. ఇలా పార్సెల్ ఇస్తారు. వీటికి పెద్దగా కంప్లయింట్లు రావు. ఈ విషయంలో పారడైజ్ది అందె వేసిన చెయ్యి.
ఇప్పుడు పరిస్థితి మారింది. కర్ణన్ సింగం మాదిరిగా దాడులు చేస్తుంటే, అందరూ గడగడ వణికిపోతున్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో ఎవరికీ చెప్పడు. సిబ్బందిని రండి అంటే వెంట వెళ్లాల్సిందే తప్ప ఏం చేయడానికి లేదు. ఆయన తనిఖీల్లో అపరిశుభ్రమైన వాతావరణం, కుళ్లి, పాచిపోయిన ఆహారపదార్థాలు, కాలం చెల్లిన సరుకులు, కల్తీ మాంసం.. పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి. కర్ణన్ టీం తీసిన ఫోటోలు చూస్తే, చస్తే ఇక రెస్టారెంట్లకు వెళ్లరు. కావాలంటే వాళ్ల ట్విటర్ అకౌంట్లో చూడవచ్చు. వాటిని సీజ్ చేయడం, ల్యాబ్‌కు పంపడం, నోటీసులివ్వడం, జరిమానా విధించడం మాత్రమే కాదు, వీటన్నింటినీ ఫోటోలు తీసి తన విభాగపు ఎక్స్(Twitter) అకౌంట్లో పూర్తి వివరాలతో షేర్ చేస్తున్నాడు. అక్కడితో ఆగలేదు.
ఫుడ్ సేఫ్టీ వింగ్ కాంటాక్ట్ వివరాలు తమ ఎక్స్ అకౌంట్లో షేర్ చేసి, ప్రజలు ఆహార నాణ్యతపై ఫిర్యాదు చేసేలా ప్రోత్సహించాడు. ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజల నుండి ఆరోపణలు రావడం, ఈయన దాడులు చేయడం ఓ ఉద్యమంలా మారిపోయింది. దాంతో ఆయా రెస్టారెంట్ల విశ్వసనీయత కూడా దారుణంగా దెబ్బతిని, వ్యాపారం దివాళా తీసే దిశగా వెళ్తూంది. దాంతో అన్ని రెస్టారెంట్లు, హోటళ్లు ఆటోమాటిక్‌గా సెట్ అయ్యాయి. ఇప్పుడు చాలా హోటళ్లలో క్రమశిక్షణ, పరిశుభ్రత కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. ఆఖరికి ప్రభుత్వ హాస్టళ్లు, ప్రైవేట్ హాస్టళ్లు, పీజీలు, క్లౌడ్ కిచెన్లు, బేస్ కిచెన్లకు కూడా వదలట్లేదు.
“అతను అధికారానికి, ఒత్తిళ్లకు అసలు భయపడడు. తెలంగాణ ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే తన లక్ష్యం” అని పదవీవిరమణ చేసిన డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ విజయకుమార్ వ్యాఖ్యానించాడు.
‘నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో అందించడం, అలాగే ఆహార నాణ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే మా ప్రయత్నం. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదు’ అని కర్ణన్ కరాకండిగా చెప్పాడు.