త్వరలో మహిళా శక్తి పాలసీ…మహిళా సంఘాల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

మహిళా సంఘాల ఆర్ధిక బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు మహిళా సంఘాలకు మెరుగైన శిక్షణలు కల్పిస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయా

త్వరలో మహిళా శక్తి పాలసీ…మహిళా సంఘాల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం
  • త్వరలో మహిళా శక్తి పాలసీ
  • మహిళా సంఘాల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం
  • రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయా

విధాత, హైదరాబాద్‌ : మహిళా సంఘాల ఆర్ధిక బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు మహిళా సంఘాలకు మెరుగైన శిక్షణలు కల్పిస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయా తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలో మహిళ స్వశక్తి కుట్టు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్, అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంకలతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఏక రూప దుస్తులు అందించే లక్ష్యంతో రాష్ట్రంలో 70 లక్షల జతల దుస్తులు కుట్టించే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించామని చెప్పారు. అన్ని జిల్లాలో 45 రోజుల్లో మహిళా స్వశక్తి కుట్టు కేంద్రాల ద్వారా ఎంతో బాధ్యతాయుతంగా దుస్తులు నాణ్యతతో సిద్ధం చేస్తున్నారని తెలిపారు. గతంలో దుస్తులు ప్రయివేట్ సంస్థలకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. సంఘాల ఆధ్వర్యంలో కుట్టు కేంద్రాలలో ఒక్కొక్క మహిళా రోజుకు 7జతలు అందిస్తున్నారని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వ పరంగా మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలలో మహిళ కమిటీలు చేపట్టామని పేర్కోన్నారు.

త్వరలో మహిళా పాలసీ
ప్రభుత్వం త్వరలోనే మహిళా పాలసీ రూపొందించి అమలు చేయనున్నట్లుగా సందీప్ కుమార్ సుల్తానీయా తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మండలంలో కట్టింగ్ మిషన్లు అందించడం జరుగుతుందని ఇకపై ప్రతి పనిలో మహిళా సంఘాలకు చేయూత కల్పించనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో మహిళకు మెరుగైన శిక్షణ ఇచ్చి రెడీమేడ్ దుస్తులలో చేయూత కల్పించడం జరుగుతుందని అన్నారు. తదుపరి మహిళలు కుడుతున్న తీరును పరిశీలించి జిల్లాలో 74 శాతం పూర్తి చేసినందుకు మహిళను, జిల్లా యంత్రాంగాన్ని ఈ సందర్బంగా అభినందించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం మేరకు జిల్లాలో 23 మండలాల్లో గల 783 ప్రభుత్వ పాఠశాలలో 43245 విద్యార్థుల దుస్తులకుగాను 62 ప్రాంతాల్లో 721 మహిళా సంఘాల సభ్యులచే ఇప్పటి వరకు 31940 మంది విద్యార్థులకు దుస్తులు సిద్ధం చేశామని అలాగే మిగిలిన దుస్తులు నిర్దేశించిన సమయం లోపు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం మహిళా సంఘాలకు ఆదాయ వనరులు పెంపొందే దిశగా మెరుగైన శిక్షణ కల్పిస్తామని అలాగే ఎక్కడకూడా రాజీ పడకుండా నాణ్యమైన దుస్తులు అందిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి పాఠశాలల పున ప్రారంభం నుండి నూతన దుస్తులు ధరించి వచ్చే విదంగా అన్ని పాఠశాలలు ప్రధానోపాధ్యాయులకు సూచనలు జారీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ మధుసూదన్ రాజు, సీఈఓ అప్పారావు, డిఈఓ అశోక్, ఏపీడీ సురేష్ కుమార్,, ఎంపీడీఓ ఎంపీవో సంజీవ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.