Crop Loans | రైతుల‌కు శుభ‌వార్త‌.. ల‌క్షా యాభై వేల లోపు రుణాలు 30న విడుద‌ల‌..!

: రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల‌కు శుభ‌వార్త వినిపించేందుకు సిద్ధ‌మైంది. ఈనెల 30న అసెంబ్లీ ఆవరణలో రెండో విడత రుణమాఫీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు.

Crop Loans | రైతుల‌కు శుభ‌వార్త‌.. ల‌క్షా యాభై వేల లోపు రుణాలు 30న విడుద‌ల‌..!

హైద‌రాబాద్ : రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల‌కు శుభ‌వార్త వినిపించేందుకు సిద్ధ‌మైంది. ఈనెల 30న అసెంబ్లీ ఆవరణలో రెండో విడత రుణమాఫీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. రెండో విడుత రుణ‌మాఫీ కార్య‌క్ర‌మాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రెండో విడుత రుణ‌మాఫీ కింద రూ. 1,50,000 రుణాల‌ను మాఫీ చేయ‌నున్నారు. ఇప్పటికే లక్ష రూపాయల వరకు రాష్ట్ర ప్ర‌భుత్వం మాఫీ చేసిన సంగ‌తి తెలిసిందే.

తొలి విడతలో దాదాపు 11 లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ. 6 వేల కోట్ల నిధులు జమ చేశారు. మరో రెండు విడతల్లో రూ. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే లక్షన్నర లోపు రెండో విడతలో రూ.లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకు మూడో విడతలో రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు.

కాగా, ఆగస్టు 15లోపు మూడో విడతలో రూ. 2 లక్షల రుణమాఫీ చేయనున్నారు. మూడో విడతగా రూ.లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకు రుణాలు తీసుకున్నవారికి లబ్ధి చేకూరనుంది. ఈ నేపథ్యంలో మూడో విడత రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసిన సంగ‌తి తెలిసిందే. ఆగస్టు 2 నుంచి 14 వరకు తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నానని వెల్లడించారు. తాను తిరిగి వచ్చిన తర్వాతే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ కల్వకుర్తిలో కాంగ్రెస్ దివంగత నేత సూదిని జైపాల్‌ రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం ప్రకటనతో మూడో విడత రుణాల కోసం ఎదురు చూస్తున్న వారు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా రుణమాఫీ జరిగి రుణాలు మంజూరు అవుతాయని భావించగా.. మరో 15 రోజులకు పైగా ఆలస్యం కావటంతో వారు ఊసురుమంటున్నారు.