విధాత ప్రతినిధి, ఉమ్మడి నిజామాబాద్: ‘బేటా ఏక్ నెంబర్.. బాపు దస్ నెంబర్ చోర్. అయ్యది డబల్ గేమ్.. కొడుకు అబద్ధాలకోరు’ అంటూ కేసీఆర్, కేటీఆర్ పై మాజీ మంత్రి షబ్బీర్ అలీ విరుచుకుపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ అన్నీ అబద్ధాలే మాట్లాడారని ఖండించారు. మీ అయ్య కన్నా ముందే నేను మంత్రిని అయ్యానని కేటీఆర్ పై మండిపడ్డారు.
కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. కామారెడ్డి ప్రాంతంలో సీఎం ఒక దుబాయి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కంటే ముందే నేను మంత్రినయ్యాను, ముందు కేటీఆర్ ఈ విషయం తెలుసుకోవాలన్నారు. తక్కువ దూరంలో హెలికాప్టర్ లో తిరగడానికి అధికారులు ఎలా అనుమతి ఇచ్చారని, దీనిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. 2004లో పొత్తు ఉన్నప్పటికీ నాపై టీఆర్ఎస్ పోటీ చేసిందని అన్నారు.
కేసీఆర్ ది డబుల్ గేమ్ అని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించుకున్నామని, కేసీఆర్ కుటుంబంలో అందరిపై కేసులున్నాయని తెలిపారు. అవినీతి కి మారుపేరు కల్వకుంట్ల కుటుంబం అని ఆరోపించారు. తనపై ఒక్క పిటి కేసు కూడా లేదన్నారు. పోలీసులపై దాడి చేసేవారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి ప్రజలు కేసీఆర్ కు పెద్ద సినిమా చూపించడానికి వస్తున్నారని, ఓడించి పంపిస్తామని స్పష్టం చేశారు.