సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్‌

పాశమైలారం సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. భద్రతా చర్యల లోపమే పేలుడికి కారణమని పిటిషన్ లో పేర్కొన్నారు. 54 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యత వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల భద్రతను పటిష్టం చేయాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. హైకోర్టు 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

sigachi-explosion-pil-telangana-high-court-safety-issues

విధాత, హైదరాబాద్ : పాశమైలారం సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. కే.బాబురావు అనే వ్యక్తి సిగాచిపై ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పరిశ్రమలో సరైన భద్రతా చర్యలు తీసుకోనందునే పేలుడు సంభవించిందని పిటిషన్ లో ఆరోపించారు. ఈ ఘటనలో 54 మంది మృతి చెందగా..28 మంది గాయపడ్డారని,పేలుడు ఘటనలో ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదని పిటిషనర్ తరుపు న్యాయవాది వసుదా నాగరాజు హైకోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు మృతుల ఆచూకీ లేని వాళ్ల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రకటించిన పరిహారం చెల్లించలేదన్నారు. పరిశ్రమ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని…ప్రమాదంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక బయటపెట్టాలన్న పిటిషన్ లో కోరారు. ఈ కేసులో ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపించాలని..ఈ తరహా ప్రమాదాలు పునరావృతం కాకుండా పరిశ్రమలలో భద్రతాచర్యలు ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం 3 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Latest News