కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలు .. భద్రకాళికి ‘బోనం’ వాయిదా

భద్రకాళి సా-క్షిగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలు పతాకస్థాయికి చేరుకుని అగ్గిపుల్ల వేయకుండానే భగ్గుమంటున్నాయి

కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలు .. భద్రకాళికి ‘బోనం’ వాయిదా
  • భద్రకాళికి ‘బోనం’ వాయిదా
  • మంత్రి సురేఖ వర్సెస్ నాయిని
  • కడియం పై సురేఖ విమర్శలు
  • నేడు ధర్మకర్తల ప్రమాణస్వీకారం
  • కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యేనా?

విధాత ప్రత్యేక ప్రతినిధి:  భద్రకాళి సా-క్షిగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలు పతాకస్థాయికి చేరుకుని అగ్గిపుల్ల వేయకుండానే భగ్గుమంటున్నాయి. మంత్రి కొండా సురేఖ దంపతులు ఒక వైపూ…మిగిలిన నాయకులు ఒక వైపు అన్నట్లుగా గ్రూప్ వార్ సాగుతోంది. ఇప్పటికే శుక్రవారం సురేఖ భర్త కొండా మురళీధర్ రావు స్వంత పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యానాలతో వర్గపోరు తీవ్రమైంది. తాజాగా శనివారం మంత్రి సురేఖ, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య మాటల మంటలు ఎగిశాయి. మధ్యలో మంత్రి కడియం శ్రీహరి పై కూడా విరుచుకపడ్డారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రానికి ఏమైందేమోగానీ ఆదివారం నిర్వహిస్తామని ప్రకటించిన ‘భద్రకాళికి బంగారు బోనం’ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ఈ ఆకస్మిక నిర్ణయం వెనుక మతలబేమిటనే చర్చ సాగుతోంది.

భద్రకాళికి ‘బంగారు బోనం’ వాయిదా

వరంగల్ నగరంలో కొలువైన భద్రకాళికి ఈ నెల 22 ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు హైదరాబాద్ లాల్ దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ‘బంగారు బోనం’ సమర్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆహ్వానపత్రికను సైతం పంపిణీ చేశారు. ఈ బంగారు బోనం వ్యవహారం ఇప్పుడు మంత్రి, ఎమ్మెల్యేల మధ్య భిన్నాభిప్రాయాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేశారు. భద్రకాళి దేవాలయంలో ఇప్పటి వరకు బోనం సమర్పించిన సంప్రదాయం లేదు. నూతనంగా తొలిసారి ఆదివారం మంత్రి ఆధ్వర్యంలో ఈ బంగారు బోనం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొత్త సంప్రదాయాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశముందన్నారు. ఇదిలా ఉండగా శనివారం భద్రకాళి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం ఉంది. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరవుతుండగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు హాజరవుతారా? అనే చర్చ సాగుతోంది.

బోనం పై మంత్రి పునరాలోచించాలి: నాయిని

భద్రకాళి అమ్మవారికి గతంలో ఎన్నడు బోనం సమర్పించలేదని, మంత్రి సురేఖ పునరాలోచన చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కోరారు. శుక్రవారం భద్రకాళిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. భద్రకాళి ఓరుగల్లు వాసుల ఇలవేల్పుగా ఉన్నారు. గ్రామ దేవతలకు బోనం సమర్పిస్తారని, తాజాగా భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించాలనే నిర్ణయం పై ఫిర్యాదులు వచ్చాయన్నారు. భద్రకాళి వద్ద జంతు బలి చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

అభివృద్ధిని అడ్డుకుంటున్న నాయిని: మంత్రి సురేఖ

మారిన పరిస్థితుల్లో కొందరి అభ్యంతరం వల్ల భద్రకాళి బోనం తాత్కాలికంగా వాయిదావేస్తున్నట్లు మంత్రి సురేఖ సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. వాయిదా ప్రకటనకు ముందు మంత్రి సురేఖ మీడియాతో చిట్‌చాట్ చేశారు. స్వంతపార్టీ ఎమ్మెల్యే నాయిని అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, భద్రకాళీ దేవాలయం ఎవరి సొత్తు కాదనీ… కొందరు తమదే అన్నట్లు భావిస్తున్నారని అన్నారు. ఆగమశాస్త్రం, పూజారుల అభిప్రాయం ప్రకారమే అమ్మవారికి బోనం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నామని,. భద్రకాళి శాఖహారి అని తెలిసి కూడా యాటలు కొస్తారని చెప్పడం సరైంది కాదన్నారు. నాయిని అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పారు. బల్కంపేట దేవాలయం నుంచి బోనం భద్రకాళికి సమర్పిస్తామని స్పష్టం చేశారు.

కడియం శ్రీహరిపై విమర్శలు:

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషంటూ… నేను మంత్రిగా ఉంటే తట్టుకోలేపోతున్నాడు. నా ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నారు… నా మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి వద్దకు వెళ్లి నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టీడీపీలో నడిచినట్లు ఇక్కడ నడుస్తుందనుకుంటున్నారని, కాంగ్రెస్‌లో సాగదన్నారు. నేను దిగిపోవాలని కోరడం సరైంది కాదన్నారు.