Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత
కాకతీయ యూనివర్సిటీలో శుక్రవారం అర్ధ రాత్రి తీవ్ర కలకలం రేగింది. విద్యార్థినులు నిద్రిస్తున్న సమయంలో పోతన మహిళా హాస్టల్లో స్లాబ్ పెచ్చులూడి బెడ్స్ పై పడ్డాయి

పెచ్చులూడి పడిన హాస్టల్ స్లాబ్
విద్యార్థినులకు తప్పిన ప్రమాదం
పట్టించుకోవడం లేదని విద్యార్థినులు అర్ధరాత్రి నిరసన
యూనివర్సిటీ అధికారుల తీరుపై ఆగ్రహం
విధాత, వరంగల్ ప్రతినిధి: కాకతీయ యూనివర్సిటీలో శుక్రవారం అర్ధ రాత్రి తీవ్ర కలకలం రేగింది. విద్యార్థినులు నిద్రిస్తున్న సమయంలో పోతన మహిళా హాస్టల్లో స్లాబ్ పెచ్చులూడి బెడ్స్ పై పడ్డాయి. ఈ సంఘటనలో విద్యార్థినిలకు తృటిలో ప్రమాదం తప్పింది. దీనితో అర్ధరాత్రి విద్యార్థినులు రోడ్డెక్కారు. పోతన హాస్టల్ ఎదుట నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ మల్లారెడ్డి హాస్టల్ కు చేరుకొని విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
అయితే హాస్టల్ లో నిత్యం సమస్యలతో ఇబ్బంది పడుతున్నామంటూ విద్యార్థినులు రిజిస్ట్రార్‌ను బంధించే యత్నం చేశారు. పలుసార్లు తమ సమస్యలు వివరించిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకూ విద్యార్థినుల నిరసన కొనసాగింది. ఇటీవలే ఫ్యాన్ ఊడిపడి విద్యార్థిని తలకు తీవ్ర గాయాలు అయిన విషయం తెలిసిందే. యూనివర్సిటీలోని హాస్టల నిర్వహణ పట్ల వర్సిటీ యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విద్యార్థులకు విమర్శిస్తున్నారు.