Supreme Court On BC Reservation | బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ కు సుప్రీంకోర్టులో ఊరట

తెలంగాణ స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లను సవాల్ చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసు హైకోర్టులో ఉండటంతో అత్యవసరం లేదని పేర్కొంది.

Supreme Court On BC Reservation | బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ కు సుప్రీంకోర్టులో ఊరట

న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇదే అంశంపై హైకోర్టులో కేసు విచారణ కొనసాగుతున్నందునా..ఇక్కడ అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదంటూ వంగా గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టుకు వెళ్లాలని స్పష్టం చేస్తూ.. పిటిషన్ డిస్మిస్ చేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. దీంతో పిటిషనర్ తన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై పిటిషన్లు ఈ నెల 8వ తేదీన విచారణలో ఉండగా ఇక్కడకు ఎందుకు వచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టు రిజర్వేషన్లపై స్టే ఇవ్వడానికి నిరాకరించిందనR పిటిషనర్ తరుపు లాయర్ సమాధానమిచ్చారు. అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడికి వస్తారా అంటూ అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం..కేసు తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉన్నందునా..ఈ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించింది. బీసీ రిజర్వేషన్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్ర పొన్నం ప్రభాకర్ లు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టులోనూ బీసి రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు.

42శాతం బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట దక్కినట్లయ్యింది. అయితే ఈ నెల 8న హైకోర్టులో ఈ కేసు విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుంది..అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.