BJP Chargesheet : కాంగ్రెస్ 23 నెలల పాలనపై బీజేపీ చార్జ్ షీట్
కాంగ్రెస్ 23 నెలల పాలనపై బీజేపీ చార్జ్ షీట్ విడుదల చేసింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై బూటకపు హామీల ఆరోపణలు గుప్పించింది.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం 23నెలల పాలనపై రాష్ట్ర బీజేపీ శాఖ చార్జ్ షీట్ విడుదల చేసింది. భస్మాసుర హస్తం పేరుతో 7 అంశాలతో రూపొందించిన చార్జ్ షీట్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు శనివారం రిలీజ్ చేశారు. బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు అంటూ చార్జ్ షీట్ లో బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ సందర్బంగా రామచందర్ రావు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420హామీలను, డిక్లరేషన్ లను అమలు చేయకుండా..మరోసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల కోసం ఏ ముఖం పెట్టకుని అడుగుతున్నారని ప్రశ్నించారు. విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ బిల్లులు, రైతులకు బోనస్, రైతు బంధు పథకాలలో వేల కోట్ల బకాయిలు పెట్టారని, రుణమాఫీ నామమాత్రం చేశారని విమర్శించారు. విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని చెప్పి సైకిల్ కూడా ఇవ్వలేదన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసి అమలు చేయలేదన్నారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ డైరక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి కాస్తా రేవంతుద్దీన్ గా మారిపోయారన్నారు. రేవంతుద్దీన్ గా ఎంతగా మారిపోయారంటే.. భారత్ సైన్యంపై పాకిస్తాన్ బాంబులు వేశారంటూ మిలటరీని, దేశాన్ని అవమానిస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనార్టీ ఓట్ల కోసం దేశాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరును బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. అసదుద్దీన్ డైరక్షన్ లో కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు క్షిణించాయని, కమిషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారన్నారని విమర్శించారు.
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల ఓట్లు దండుకుని సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు అదే రైతులు ఇబ్బందుల్లో ఉంటే వారిని విస్మరిస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందో, ప్రభుత్వం ఎంతమందికి నష్టపరిహారం ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే ఫించన్లు, సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఓటర్లను బెదిరించడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలతోనే రేవంత్ రెడ్డి సీఎం స్థాయికి ఎదిగారని, ఉప ఎన్నికలలో ప్రజల ఓట్లు అడిగేముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.
ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలకులు దోచుకున్న లక్ష కోట్లు కక్కించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాందీలు ఇప్పటిదాక ఎన్ని కక్కించారో చెప్పాలన్నారు. జీవో 111 ముసుగులో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎన్ని భూములు గుర్తించాడో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వంగా మారిపోయిందన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సీతారంపూర్ లో 1000ఎకరాల దేవుడి మాన్యాలను బీఆర్ఎస్ అక్రమంగా విక్రయిస్తే..కాంగ్రెస్ రక్షణ శాఖ భూమును ఖబరిస్తాన్ కు కేటాయించందన్నారు. అదే మైనార్టీల భూములను ఒక్క ఎకరం కూడా ఆ రెండు పార్టీలకు తీసుకునే దమ్ము లేదన్నారు. దీనిపై ప్రజలు ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, పాయల్ శంకర్ రావు, కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram