విధాత, హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశాన్ని 21వ తేదీ నుంచి 23వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 21వ తేదీన సరస్వతి అంత్య పుష్కరాలు ఉన్న నేపథ్యంలో 21నుంచి 23కు మార్చింది. 23న యాదగిరిగుట్టలో కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే 23న యాదగిరిగుట్టలో వేద పాఠశాలను సీఎం ప్రారంభించనున్నారు. రాష్ట్ర సచివాలయంలో కాకుండా రాజధానికి, సచివాలయానికి వెలుపల మరోసారి కేబినేట్ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
పుష్కరాలలో మంత్రుల బిజీ..అందుకే వాయిదా
‘బాసర సరస్వతి అంత్య పుష్కరాలు’ ఈ నెల 21వ తేదీన ప్రారంభం కానున్నాయి. గోదావరి నది తీరాన వెలసిన బాసర క్షేత్రంలో జరిగే ఈ అంత్య పుష్కరాలకు రాష్ట్ర మంత్రివర్గంలోని మెజార్టీ మంత్రులు హాజరుకానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం, పుష్కరాల పనులను పర్యవేక్షించడం మంత్రులు బిజీ కానున్నారు. పుష్కరాల పనుల్లో, అధికారిక పర్యటనల్లో మంత్రులు నిమగ్నమవ్వడం, బాసరకు వెళ్లనుండటంతో.. అదే రోజు నిర్వహించాలనుకున్న కేబినెట్ సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి 23వ తేదీకి మార్చారు. అలాగే మంత్రివర్గ సమావేశ వేదికను సైతం సచివాలయం నుంచి యాదగిరిగుట్టకు మార్చేశారు.
అప్పుడు మేడారంలో..ఇప్పుడు యాదగిరిగుట్టలో..
లక్ష్మీనరసింహస్వామి పవిత్ర క్షేత్రం యాదగిరి గుట్టలో కేబినెట్ భేటీ నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక, రాజకీయ సందేశాన్ని, ప్రజాప్రభుత్వ భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేవచ్చని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనగా కనిపిస్తుంది. రాజధాని హైదరాబాద్ వెలుపల కేబినెట్ భేటీలు నిర్వహించడం సీఎం రేవంత్‌రెడ్డికి ఇది కొత్తేమీ కాదు. గతంలో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క – సారలమ్మ జాతర సందర్భంగా రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో కలిసి మేడారంలోనే కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. అక్కడికక్కడే జాతర ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలు, నిధుల విడుదలపై కీలక నిర్ణయాలు తీసుకుని కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టడం గమనార్హం. యాదగిరిగుట్టలో లక్ష్మినరసింహస్వామి సన్నిధిలో నిర్వహించే తెలంగాణ కేబినెట్ ఎలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతుందోనని అందరు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
అజెండా అంశాలపై ఆసక్తి…
రాష్ట్ర అవతరణ జూన్ 2వ తేదీకి ముందు జరుగబోతున్న తెలంగాణ కేబినెట్ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోయే పలు కొత్త నిర్ణయాలు, పథకాలపై చర్చించి ఆమోదం తెలుపవచ్చని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రతి కుటుంబానికి రూ. 5లక్షల బీమా, కొత్త ఆసరా పింఛన్లు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమంపైన పలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువపైనే కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. భూముల విలువ పెంపు ప్రతిపాదనలపై ఇప్పటికే నివేదిక సిద్దం చేయడంతో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 28 నుంచి కొత్త మార్కెట్ విలువల ప్రకారం స్టాంప్ డ్యూటీ వసూలు చేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. భూముల విలువల పెంపు ద్వారా ఈ ఏడాది అదనంగా రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకూ ఆదాయాన్ని రాబట్టుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
పెండింగ్ లో ఉన్న రైతు భరోసా మూడో వాయిదా నిధుల విడుదలపైన, ధాన్యం కొనుగోలు సమస్యలపైన, తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపైన చర్చించవచ్చని భావిస్తున్నారు. అలాగే ఉద్యోగుల డిమాండ్లు, ఆర్టీసీ సమ్మె హామీల అమలు సహా మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వంటి పథకాలపై చర్చిస్తారని సమాచారం. జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు, అకడమిక్ క్యాలెండర్, పంటల మార్పిడి విధానం, ఫీజుల నియంత్రణ అంశాలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :
తీరని మంత్రి సీతక్క చదువుల దాహం
విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలవచ్చు : స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
