Congress PAC Meeting | స్థానిక ఎన్నికలపై మంత్రుల కమిటీ.. రిజర్వేషన్లపై న్యాయపోరాటం : కాంగ్రెస్ పీఏసీ కీలక నిర్ణయాలు
స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా అభిప్రాయాలు సేకరించేందుకు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది పీఏసీ సమావేశం. లీగల్ నిపుణులతో పాటు అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించి ఈ నెల 26వ తేదీ వరకు ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29న ఈ రిపోర్టుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.

హైదరాబాద్, ఆగస్ట్ 24 (విధాత):
Congress PAC Meeting | స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా అభిప్రాయాలు సేకరించేందుకు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది పీఏసీ సమావేశం. లీగల్ నిపుణులతో పాటు అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించి ఈ నెల 26వ తేదీ వరకు ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29న ఈ రిపోర్టుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. మరో వైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులపై సుప్రీంకోర్టులో పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే ఇద్దరు న్యాయవాదులను నియమించింది. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ పీఏసీ, పీసీసీ అడ్వయిజరీ సంయుక్తంగా శనివారం గాంధీ భవన్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షత వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటేడ్ పోస్టుల భర్తీ, ఓటు చోరీ, యూరియా కొరత, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. తొలుత సమావేశంలో ఓటు చోరీ పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రాల నుంచి వచ్చిన బిల్లులను 90 రోజుల్లో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు ఐదు నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ బీసీ రిజర్వేషన్ బిల్లులకూ వర్తించే అవకాశం ఉందనేది ప్రభుత్వ వాదన. ఇదే అంశంపై ఉన్నత న్యాయస్థానాన్ని ప్రభుత్వం ఆశ్రయించింది.
మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, పొన్నం ప్రభాకర్ తో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నెల 26 వరకు ఈ కమిటీ తన నివేదికను ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 29న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నివేదికపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఈ కమిటీ స్థానిక సంస్థల ఎన్నికలపై విస్తృతంగా అభిప్రాయాలను సేకరించనుంది. అదే సమయంలో న్యాయ నిపుణులతో కూడా చర్చించనుంది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేది లోపుగా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రిజర్వేషన్ల అంశం తేలనందున పార్టీ పరంగా బీసీలకు 42 శాతం పార్టీ పరంగా టికెట్లు ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చించారు. ఓట్ల చోరీ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మృతికి సమావేశం సంతాపం తెలిపారు. సుధాకర్ రెడ్డి పార్థీవదేహనికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులు నివాళులర్పించారు.
ఉప రాష్ట్ర పతి అభ్యర్థిగా రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించినందుకు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం, పౌర హక్కుల ను కాపాడటం కోసం పని చేశారని ఆయన గుర్తు చేశారు. రాహుల్ గాంధీ, పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్రం లో కులగణన చేపట్టామన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ లో బిల్ పాస్ చేసుకున్నామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు విడిగా మరో బిల్ తీసుకొచ్చామని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారని, ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చామని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ తెచ్చిన చట్టం ప్రకారం బీసీలకు ఒక్క శాతం రిజర్వేషన్ కూడా రాదన్నారు. బీసీలకు మేలు జరగాల్సిందేనని, రాహుల్ గాంధీ హామీ నెరవేర్చాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని రేవంత్ అన్నారు. బీఆర్ ఎస్, బీజేపీ కలిసి యూరియా కొరతపై డ్రామాలు ఆడుతున్నాయని రేవంత్‌రెడ్డి విమర్శించారు. యూరియా ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తానని కేటిఆర్ అనడంలోనే వాళ్ల తీరు అర్థం అవుతుందన్నారు. యూరియా కోసం నాలుగు సార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్ ను కలిసిన విషయాన్ని గుర్తు చేశారు.యూరియా పంపిణీ పై క్షేత్రస్థాయి లో మానిటరింగ్ ను పెంచాలని సీఎం కోరారు.