CM Chandrababu Naidu : వైసీపీ భూతాన్ని భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేతన్నల భరోసా కింద కుటుంబాలకు రూ.25వేలు, 40వేల సెలూన్లకు ఉచిత విద్యుత్తు పథకాలు ప్రారంభం ప్రకటించారు.

త్వరలో వారి ఖాతాల్లో రూ.25వేలు
స్వర్ణాంధ్రా కావాలంటే వైకుంఠపాళి వద్ధు
అమరావతి : రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండు అందిస్తున్నామని..త్వరలోనే నేతన్నల భరోసా కింద ఒక్కో కుటుంబానికి రూ.25వేలు అందించబోతున్నామని..అదే రోజు 40వేల సెలూన్లకు 200యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని ప్రారంభించబోతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రం స్వర్ణాంధ్ర కావాలంటే ప్రజల ఆలోచన విధానం మారాలంటూ హితవు పలికారు. ప్రతి ఒక్కరు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రాష్ట్రానికి వైకుంఠపాళి ఆట మంచిది కాదని.. మనకు అభివృద్ది కావాలి.. పేదరికం పోవాలని.. పేదవాళ్లకు సాయం చేసేందుకు మార్గదర్శులు ముందుకు రావాలన్నారు. మీ రాష్ట్రంలో భూతం ఉంది.. మళ్లీ రాదని గ్యారంటీ ఏంటని అడుగుతున్నారని..వదల బొమ్మాళీ అంటున్న వైసీపీ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందన్నారు. వైసీపీ నాయకులు అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేస్తున్నారని..అమరావతికి నిధులు ఇవ్వొద్దని అందరికీ లేఖలు రాశారని..మునిగిపోయింది అమరావతి కాదని, వైసీపీ పార్టీ అని చురకలేశారు. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి రాజధాని నిర్మాణం చేస్తామని చంద్రబాబు పునురుద్ఘాటించారు. అమరావతి, విశాఖ, తిరుపతిని మహానగరాలుగా మారుస్తామని.. పెట్టుబడులు పెట్టేందుకు వస్తే ఎవరైనా ఆహ్వానిస్తామన్నారు. రాష్ట్రం బాగు కోసం కూడా పది తరాల ముందు ఆలోచించాలన్నారు. మనది విజన్ రాజకీయం.. వాళ్లది క్రిమినల్ రాజకీయం’’ అని చంద్రబాబు వైసీపీపై విమర్శలు గుప్పించారు.
సూపర్ సిక్స్.. సూపర్ హిట్
అప్పులతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తే దీర్ఘకాలం కొనసాగవని సీఎం చంద్రబాబు అన్నారు. సంపద సృష్టించడం.. ఆదాయాన్ని పెంచడం మాకు తెలుసని..ప్రతి ఒక్కరి ఆదాయం పెరుగాలన్నదే మా లక్ష్యమన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందని..అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఎప్పటికప్పుడు వారి ఖాతాల్లో నగదు జమచేస్తున్నాం అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు చాలా ఆనందంగా ఉన్నారని.. ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం అని గుర్తు చేశారు. పీ-4 ద్వారా పేదప్రజలను ఆదుకునే కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. అక్టోబరు 2 నాటికి అన్ని మున్సిపాలిటీల్లో చెత్తాచెదారం తొలగిస్తామన్నారు. ఈ-వేస్ట్‌ను రీసైక్లింగ్‌కు పంపేలా ఆలోచనలు చేస్తున్నామని.. పేదవాడి ఆరోగ్యం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పెద్దాపురంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు.